చైనాతో సరిహద్దులో హింసాత్మక ఘటన తర్వాత భారత్ ఐక్యంగా ఉందని ప్రపంచానికి చూపించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ విమర్శించారు. ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... చైనా సరిహద్దు ఘర్షణ సహా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుపై అభిప్రాయాలు వెల్లడించారు.
ఇదీ చదవండి:'దేశంలో ప్రతి సంక్షోభానికి మోదీ విధానాలే కారణం'
చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు వీరమరణం పొందటంపై ఖుర్షీద్ విచారం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతల విషయంలో అస్పష్టత, గందరగోళం ఉందన్నారు. వీటి మధ్య ఎలా ముందుకెళ్లాలో ప్రభుత్వానికి సరైన ఆలోచన లేదని విమర్శించారు. మృతుల కుటుంబాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
నేతల మధ్యే సమస్య!
చైనాకు ఉన్న సమస్య ఏంటో తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఖుర్షీద్. సమస్య ఇరు దేశాల సైన్యాల మధ్య కాదని.. రాజకీయ నాయకుల మధ్యే ఉందని పేర్కొన్నారు. దౌత్యపరమైన మార్గాల్లో చర్చించేటప్పుడు అన్ని విషయాలు ఒకేసారి ప్రస్తావించాల్సిన అవసరం లేదని అన్నారు ఖుర్షీద్.
"దౌత్యం చేస్తున్నప్పుడు సరైన వ్యూహంతో వ్యవహరించాలి. అవతలి వారు నిర్దిష్ట పద్ధతిలోనే ఎందుకు వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. చర్చల్లో ప్రతిదీ ప్రస్తావించడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల చాలా వివరాల గురించి మాట్లాడటం మంచిది కాదు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో మంచి సంబంధాలున్నాయని ప్రధాని మోదీ చెప్పుకుంటారు కాబట్టి అసలు సమస్య ఏంటో ఆయనే తెలుసుకోవాలి."
-సల్మాన్ ఖుర్షీద్, మాజీ విదేశాంగ మంత్రి
ప్రపంచం భరించలేదు
చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు ఖుర్షీద్. రెండు అణ్వాయుధ దేశాల మధ్య పోరును ప్రపంచం తట్టుకోలేదని పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సంస్కరణల కోసం భారత్ ప్రయత్నిస్తోందని.. ఈ పరిస్థితుల్లో పొరుగుదేశాలతో యుద్ధం చేయడం మంచిది కాదని అన్నారు.
"యుద్ధం అనేది అద్భుతమైన విషయం కాదు. అపారమైన ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధం జరగాలని ఆడంబరమైన ధైర్యసాహసాలు ప్రదర్శించేవారు దేశానికి సేవ చేస్తున్నట్లు కాదు. పొరుగుదేశాలతో కలిసి ఉండాలంటే ఒకరి నుంచి లాక్కోవడం మానేయాలని చైనాను ఒప్పించాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలి. ప్రపంచమంతా ఈ విషయాన్ని గమనిస్తున్నప్పుడు చర్చలు విఫలమవుతాయని అనుకోకూడదు."