తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ 2.0: నవ శకానికి నాంది.. దౌత్యపరంగా విజయం - modi one year journey

దేశంలో మోదీ 2.0 సర్కార్​ ఏర్పడి నేటితో ఏడాది పూర్తవుతోంది. ఈ మధ్యలోనే భాజపా ఎజెండా అంశాలైన జమ్ముకశ్మీర్​​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసింది. వివాదాస్పద ట్రిపుల్​ తలాక్​​ బిల్లుకు, పౌరసత్వ సవరణ బిల్లుకు చట్టసభల ఆమోదం తెలిపింది. ఇక దేశానికి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా సహా పలు దేశాల్లో పర్యటించి.. దౌత్య సంబంధాల పరంపరలో తనదైన ముద్రవేశారు మోదీ. ఒక్కసారి వాటిని మళ్లీ గుర్తు చేసుకుందాం.

modi government one year journey special story
నవ శకానికి పునాది.. 'నరేంద్రు'ని ఏడాది ప్రస్థానం

By

Published : May 30, 2020, 11:07 AM IST

'ఫిర్‌ ఏక్‌ బార్‌.. మోదీ సర్కార్‌' (మరోసారి మోదీ ప్రభుత్వం) నినాదం 2019 ఎన్నికల్లో దేశమంతటా పిక్కటిల్లింది. నరేంద్రమోదీకి భారతావని రెండోసారి అఖండ విజయాన్ని కట్టబెట్టింది. ఆ విజయోత్సాహంతో గద్దెనెక్కిన మోదీ తొలి 100 రోజుల్లోనే దేశ చరిత్రలో నిలిచిపోయే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి శనివారం నాటికి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో భాజపా ఎజెండా అంశాలైన జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ప్రభుత్వం రద్దుచేసింది. రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. వివాదాస్పద ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు, పౌరసత్వ సవరణ బిల్లుకు చట్టసభల ఆమోదం పొందింది. అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు పరిష్కారం చూపడం ఈ ప్రభుత్వానికి కొండంత ఊరట. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచ దేశాల్ని చుట్టబెడుతున్న తరుణంలో- భారత్‌లో దీన్ని కట్టడిచేయడానికి మోదీ సర్కారు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని.. ఆరంభంలోనే కరోనా వ్యాప్తికి బ్రేకులు వేసింది. 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది. 'ఆత్మ నిర్భర్‌ భారత్‌'తో భారతావనిలో భరోసా నింపే ప్రయత్నం చేసింది. మోదీ సాగించిన విదేశీ పర్యటనలు ఆయా దేశాలతో దౌత్య సంబంధాల మెరుగుకు దోహదపడ్డాయి.

దౌత్య విజయపథం

భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలి ఏడాది పాలనలో దౌత్య సంబంధాల పరంపరలో తనదైన ముద్ర వేశారు. అమెరికా సహా పలు కీలక దేశాల్లో పర్యటించారు. గతంలో ఏ ప్రధానీ వెళ్లని దేశాలకు సైతం వెళ్లారు. ఆర్థిక, రక్షణ, విద్యుత్తు వంటి రంగాల్లో వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటనలు దోహదపడ్డాయి. ఎన్నో వేదికలపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎండగట్టారు. దేశ ప్రయోజనాలు, అభివృద్ధి, సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవం, సహకారం వంటివాటి ఆధారంగానే మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం కొనసాగుతోంది. ఈ ఏడాది కాలంలో మోదీ 10 విదేశీ పర్యటనలు చేశారు. 2019 జూన్‌ 8 నుంచి నవంబరు 15 మధ్య ఆయన 13 దేశాల్లో పర్యటించారు. మరోవైపు దాదాపు 30 దేశాల అధినేతలు, ఇతర ప్రముఖులు భారత్‌లో పర్యటించారు. విస్తృత స్థాయిలో ఆయా దేశాల ప్రతినిధులతో చర్చించారు.

దేశ యువతలో ఎన్నో ఆకాంక్షలున్నాయి.. భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడం ప్రస్తుతం నవ్య భారతావనికి ప్రామాణికం. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కాదు.. దీర్ఘకాలిక దార్శనికతతో అడుగులు ముందుకు వేస్తున్నాం. నవ భారతాన్ని సాధించాలన్న దేశ ప్రజల స్వప్నం సాకారానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. వేరెవరితో కాకుండా మాతో మేమే పోటీ పడుతున్నాం. మాకు మేమే సవాళ్లు రువ్వుకుంటున్నాం. ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని వాటికి మించిన ఫలితాలను రాబడుతున్నాం.

-మోదీ

1. ఎప్పుడు: 2019 జూన్‌ 8-9

ఎక్కడ: మాల్దీవులు, శ్రీలంక

రెండో దఫా పాలనలో మోదీ తొలి విదేశీ పర్యటన ఇది. మాల్దీవుల అత్యున్నత పురస్కారం ‘రూల్‌ ఆఫ్‌ నిషాన్‌ ఇజ్జుద్దీన్‌’ను ఆయనకు ప్రదానం చేశారు. సాగర జలాలపై అధ్యయనం, ఆరోగ్యం, నౌకాయాన సహకారం వంటి అంశాలపై పలు ఒప్పందాలు కుదిరాయి. అప్పట్లో భీకర ఉగ్రదాడికి గురైన శ్రీలంక దేశంలో పర్యటించిన మోదీ అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు ధైర్యాన్ని నూరిపోశారు.

2. ఎప్పుడు: జూన్‌ 13-14

ఎక్కడ: కిర్గిజిస్థాన్‌

షాంఘై సహకార సంస్థ కిర్గిజిస్థాన్‌లో నిర్వహించిన శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. తాము ఉగ్రవాద రహిత సమాజానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. చైనా, రష్యా, కిర్గిజిస్థాన్‌ అధ్యక్షులతో విస్తృత చర్చలు జరిపారు. ఏకంగా 15 ఒప్పందాలపై భారత్‌-కిర్గిజిస్థాన్‌ సంతకాలు చేశాయి.

3. ఎప్పుడు: జూన్‌ 27-29

ఎక్కడ: జపాన్‌

జీ-20 సదస్సుకు మోదీ హాజరు. జపాన్‌-భారత్‌ సంబంధాల బలోపేతంపై జపాన్‌ ప్రధాని షింజో అబేతో చర్చలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉగ్రవాదం, వాతావరణ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనే విషయమై భేటీ. బ్రిక్స్‌ దేశాధినేతలతో చర్చలు. ఇండొనేసియా, బ్రెజిల్‌, టర్కీ, ఆస్ట్రేలియా, సింగపూర్‌, చిలీ దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు. యోగా గురించి ప్రముఖంగా వివరించారు.

4. ఎప్పుడు: ఆగస్టు 17-18

ఎక్కడ: భూటన్‌

భూటన్‌ ప్రధాని లోటే థేర్సింగ్‌తో భేటీ. ఐటీ, అంతరిక్ష పరిశోధన, విద్యుత్తు వంటి పది ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు.

5. ఎప్పుడు: ఆగస్టు 22-27

ఏయే దేశాలు: ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌

భారత ప్రధానుల్లో తొలిసారిగా బహ్రెయిన్‌లో పర్యటించింది మోదీయే. అంతరిక్ష, సౌర విద్యుత్తు రంగాల్లో సహకారానికి ఒప్పందం. ‘జీ-7’ సదస్సుకు ఫ్రాన్స్‌ వెళ్లిన మన ప్రధాని, ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానితో చర్చలు జరిపారు. యూఏఈ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయేద్‌’ మోదీకి ప్రదానం.

6. ఎప్పుడు: సెప్టెంబరు 4-5

ఎక్కడ: రష్యా

తూర్పు ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు. జపాన్‌, మలేసియా, మంగోలియా దేశాధినేతలతో భేటీ. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో - వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, సాంస్కృతికం, ఆర్థిక, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు.

7. ఎప్పుడు: సెప్టెంబరు 21-27

ఎక్కడ: అమెరికా

పెట్టుబడుల ఆకర్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్‌ విజయాలు, గాంధీతత్వాన్ని ప్రపంచానికి చాటేందుకు మోదీ అమెరికాలో పర్యటించారు. హ్యూస్టన్‌లో ప్రవాస భారతీయులతో భారీఎత్తున నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పాల్గొన్నారు. న్యూయార్క్‌లోనూ పర్యటించారు. ఐరాస కీలక సదస్సులు, చమురు కంపెనీల సీఈవోలతో చర్చలు, గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరంలోను, ఐరాస సర్వప్రతినిధి సభలోను వివిధ అంశాలపై ప్రసంగించారు.

8. ఎప్పుడు: అక్టోబరు 28-29

ఎక్కడ: సౌదీ అరేబియా

భవిష్యత్తు పెట్టుబడులపై మోదీ కీలకోపన్యాసం. సౌదీ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌-సౌద్‌, యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చలు. రక్షణ పరిశ్రమలు, భద్రత, పునురుత్పాదక ఇంధనం తదితరాలకు సంబంధించిన 12 ఒప్పందాలపై ఉభయ దేశాలు సంతకాలు చేశాయి.

9. ఎప్పుడు: నవంబరు 2 - 4

ఎక్కడ: థాయ్‌లాండ్‌

ఆసియాన్‌-ఇండియా, తూర్పు ఆసియా సదస్సులతోపాటు ఇండో-పసిఫిక్‌ రీజనల్‌లో ఆసియాన్‌ దేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్యం-ఆర్‌సీఈపీ సదస్సుల్లో మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదం అణచివేతే భారత్‌ దృఢ సంకల్పమన్నారు.

10. ఎప్పుడు: నవంబరు 13-15

ఎక్కడ: బ్రెజిల్‌

'నవ్య భవితకు ఆర్థిక ప్రగతి' అనే అంశంపై జరిగిన 11వ బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సుకు హాజరు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారోతో చర్చలు.

మోదీ, ట్రంప్​

భారత్‌లో విదేశీ ప్రముఖులు

ప్రధానిగా రెండో విడత మోదీ ప్రమాణ స్వీకారానికి 8 ఇరుగు పొరుగు దేశాల నేతలు హాజరయ్యారు. ఈ ఏడాది కాలంలో 30 దేశాలకు చెందిన ప్రముఖులు భారత్‌లో పర్యటించారు. వీరిలో ఆయా దేశాధినేతలు, మంత్రులు, కార్యదర్శులు...తదితర హోదాల్లోని వారున్నారు. ప్రధానంగా 2020 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన అత్యంత కీలకం. అమెరికాలో ‘హౌడీ మోదీ’ మాదిరిగా గుజరాత్‌లో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ట్రంప్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి అహ్మదాబాద్‌, ఆగ్రా, దిల్లీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. మోదీ-ట్రంప్‌ల మధ్య సౌహార్దం వెల్లివిరిసింది.

మోదీ, జిన్​పింగ్​

అలాగే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మహాబలిపురం తదితర ప్రాంతాల్లో అక్టోబరులో ప్రధాని మోదీతో కలిసి పర్యటించారు. ఇరువురు అధినేతల మధ్య కీలక చర్చలు జరిగాయి. ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో నవశకానికి నాందిగా చెప్పొచ్చు. భారత్‌లో పర్యటించిన ఇతర ప్రముఖుల్లో జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజెలా మెర్కెల్‌; మియన్మార్‌, పోర్చుగీస్‌, శ్రీలంక, బ్రెజిల్‌, చైనా, బంగ్లాదేశ్‌, మంగోలియా, జాంబియా, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ గ్రెనడైన్స్‌ తదితర దేశాల అధ్యక్షులు, ప్రధానులు; నెదర్లాండ్స్‌ రాజు, రాణి; కామన్వెల్త్‌ సెక్రటరీ జనరల్‌, షాంఘై సహకార సంస్థ సెక్రటరీ జనరల్‌ తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి:మోదీ 2.0: తొలి ఏడాది ప్రోగ్రెస్​ రిపోర్ట్​ ఇది...

ABOUT THE AUTHOR

...view details