ముక్కుపచ్చలారని పసిబిడ్డలపై నానాటికీ పెరుగుతున్న అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దుర్మదాంధుల దాడులనుంచి పసినలుసులను ఏ విధంగా కాపాడుకోవాలో అంతు చిక్కక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. కఠిన చట్టాలు, తీవ్రమైన శిక్షలూ అకృత్యాలను అడ్డుకోలేకపోతున్నాయి. కేసుల విచారణలో జాప్యం, నేర నిర్ధారణలో పోలీసుల వైఫల్యం వంటివి సమస్యను సంక్షోభ స్థాయికి చేరుస్తున్నాయి.
అడ్డు రాళ్లు వేస్తున్నా ఆగని అఘాయిత్యాలు
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని గ్రామంలో ఓ కామాంధుడు మూడున్నరేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి ఒడికట్టాడు. వికారాబాద్ జిల్లా పెద్దాపూర్ మండల పరిధిలో ఓ యువకుడు సమీపంలోని ఇంట్లో ఉండే అయిదేళ్ల పసిపాపపై అకృత్యానికి తెగబడ్డాడు. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో పదమూడేళ్ల బాలికను ముగ్గురు స్నేహితులు అత్యాచారం చేశారు. దాంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అసోమ్‌లో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కన్నతండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
హరియాణాలోని గురుగ్రామ్ ప్రాంతానికి చెందిన ఓ తండ్రి తన ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి ఒడికట్టినందుకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఛత్తీస్‌గఢ్‌లో పాఠశాల ప్రాంగణంలో ఓ చిన్నారిపై తోటి విద్యార్థులే అఘాయిత్యానికి ఒడికట్టారు. ఐపీసీ సెక్షన్ 376, 354ఏ, పోక్సో చట్టంలోని సెక్షన్ 4 కింద నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా రోజూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. వివిధ కారణాలవల్ల కొన్ని ఘటనలు వెలుగులోకి రావడం లేదు.
నత్తనడకలా సాగుతున్న కేసులు
బాలికలపై నేరాలు ఏటికేడు పెరిగిపోతున్నాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ నేరవిభాగం గణాంకాల ప్రకారం 2015లో చిన్నారులపై జరిగిన నేరాలకు సంబంధించి 94,172 కేసులు నమోదవగా, 2016లో ఆ సంఖ్య 1,06,958కి చేరుకుంది. ఏటా పెరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యధికంగా అంటే యాభై శాతానికి పైగా కేసులు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ, పశ్చిమ్‌బంగలోనే నమోదవుతుండటం గమనార్హం. చిన్నారులపై నేరాల్లో 18శాతం అత్యాచారానికి సంబంధించినవే. పోక్సో చట్టం కింద 34.4 శాతం కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 15.3, మహారాష్ట్రలో 13.6, మధ్యప్రదేశ్‌లో 13.1 శాతం కేసులు నమోదయ్యాయి.