లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో చైనా అతిక్రమణలకు పాల్పడినట్లు అంగీకరిస్తూ ఒక అధికారిక పత్రం రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. దీనిపై వార్తలు రావడంతో రక్షణ శాఖకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఆ పత్రాన్ని వెంటనే వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.
రక్షణ శాఖ ఈ పత్రాన్ని మంగళవారం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. 'జూన్ 2020లో రక్షణ శాఖ చేపట్టిన కార్యక్రమాలు' పేరిట రూపొందించిన ఈ పత్రంలో భారత్, చైనా సైన్యాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించింది.
ఈ పత్రంలో ఏముందంటే..
"వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురుసుతనం పెరిగింది. ముఖ్యంగా మే 5 నుంచి గల్వాన్ లోయలో ఇది ఎక్కువగా కనిపించింది. చైనా బలగాలు మే నెల 17, 18 తేదీల్లో కుంగ్రాంగ్ నాలా, పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం, గోగ్రా వద్ద అతిక్రమణలకు పాల్పడ్డాయి" అని పేర్కొంది.
ఉద్రిక్తతలు చల్లార్చేందుకు రెండు దేశాల సైనికాధికారుల మధ్య క్షేత్రస్థాయిలో చర్చలు జరిగాయని కూడా తెలిపింది. జూన్ 6న కోర్ కమాండర్ స్థాయి భేటీ జరిగిందని వివరించింది. అయితే జూన్ 15న జరిగిన హింసాత్మక ఘర్షణ వల్ల రెండు వైపులా మరణాలు సంభవించాయని తెలిపింది.
"పరస్పరం ఆమోదయోగ్య స్థాయిలో ఏకాభిప్రాయానికి రావడానికి సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సైనిక ప్రతిష్టంభన దీర్ఘకాలం కొనసాగేలా ఉంది" అని వివరించింది.