కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగుతోంది. ఎవరింట్లో వారు కాలిమీద కాలేసుకుని కూర్చుని దేశాన్ని రక్షించే పనిలో ఉన్నారు. కానీ, సొంతూరుకు దూరంగా ఉన్నవారి పరిస్థితి ఏంటి? ఊరు గాని ఊర్లో బతుకీడుస్తున్న వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారు. ఇళ్లకు వెళ్లిపోదామంటే రవాణా సౌకర్యాలు లేవు. చేసేదేమీ లేక రిక్షాల్లోనే రాష్ట్రాలు దాటి ఇళ్లకు చేరే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. అదీ కుదరకపోతే జాతీయ రహదారులపై పాదయాత్రలు చేస్తున్నారు.
నడిచెళ్లిపోతాం..
సామాజిక దూరం పాటించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును బేఖాతరు చేస్తూ.. ఉత్తర్‌ప్రదేశ్ నొయిడాలో వలస కార్మికులు కుటుంబసమేతంగా నడిచి సొంత ఊర్లకు పయనమయ్యారు. మహిళలు, పిల్లలను వెంటబెట్టుకుని భారీ సంఖ్యలో జాతీయ రహదారిపై కాలినడక సాగిస్తున్నారు. అడిగితే.. మా కంపెనీలకు సెలవులిచ్చారు, మేమిక్కడుండి ఏం చేయాలి అంటున్నారు.
"నేను హరియాణా, బహదూర్గఢ్ (సుమారు 358కి.మీల దూరం) నుంచి నడుస్తూ వస్తున్నా.. నేను ఈటాకు వెళ్లాలి. నేను పనిచేసే సంస్థ మూతబడింది. ఇంక నాకు ఊరెళ్లిపోవడం తప్ప వేరే దారేది?"
- ఆశిష్, వలస కార్మికుడు
రిక్షా తొక్కుకుంటూ..
దిల్లీ నుంచి వందల కిలోమీటర్లు రిక్షా తొక్కుతూ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకున్న కొంతమంది రిక్షావాలాలను అక్షరధామ్ పోలీసులు అడ్డకున్నారు. ప్రత్యేక బస్సులైనా ఏర్పాటు చేస్తాం కానీ, కేవలం ఇంటికెళ్లేందుకు ఇంతటి సాహసాలు చేయొద్దని కోరారు.
"ఇక్కడ (దిల్లీలో) మాకు పని దొరకట్లేదు. అందుకే, మా రిక్షాలోనే బంగాల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం రిక్షా తొక్కుతాం. ఇలా వెళితే కనీసం 7 రోజుల్లో మేము ఇళ్లు చేరుతాం. కానీ, పోలీసులు మమ్మల్ని వెనక్కి పంపించేస్తున్నారు. వారు మా అందరినీ ఓ ప్రత్యేక బస్సులో పంపిస్తామన్నారు."