కరోనా లాక్డౌన్ కారణంగా.. దేశవ్యాప్తంగా మార్చి నెల చివరి వారం నుంచి షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లు.. సెప్టెంబర్ 1 నుంచి తిరిగి పరుగులుపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అన్లాక్-4లో భాగంగా మెట్రో సేవలను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో మద్యం అమ్మకాల కోసం బార్లను కూడా అనుమతించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు మాత్రం ఈసారీ తెరుచుకునే అవకాశాలు కనపడటం లేదు.
తుది నిర్ణయం వారిదే...
మెట్రో సేవల పునరుద్ధరణకు కేంద్రం అనుమతించినప్పటికీ... తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఓ అధికారి వెల్లడించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు.
పాఠశాలలు, కళాశాలలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు లేవని.. అయితే వర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎమ్ల వంటి ఉన్నత విద్యా వ్యవస్థల పునరుద్ధరణపై చర్చలు జరుగుతున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
ఇదీ చూడండి:-ఆ భాజపా ఎంపీ ఇంట్లో 12 మందికి కరోనా
- సినిమా హాళ్లు తెరుచుకోవడానికి కూడా మరికొంత సమయం పట్టేటట్టు కనపడుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. కార్యకలాపాలు సాగించడం కష్టం కాబట్టి వాటిని ఇప్పట్లో తెరవకూడదని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.
- అయితే కంటైన్మెంట్ జోన్లలో ఇప్పుడున్న కఠిన ఆంక్షలే.. కొనసాగించేందుకు కేంద్రం మొగ్గుచూపుతోంది.
- ఈ వారంలో అన్లాక్-4 మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసే అవకాశముంది.
ఇదీ చూడండి-కరోనా పంజా: 'మహా'లో 7 లక్షలకు చేరువలో కేసులు