రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న దశలో ఎండీఎంకే పార్టీ అధినేత వైగోకు చుక్కెదురైంది. 2009నాటి దేశ ద్రోహం కేసులో ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు. భారత ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైకో వ్యాఖ్యలు సెక్షన్ 124ఏ (దేశద్రోహం) కిందికి వస్తాయని జస్టిస్ జే. శాంతి తీర్మానించారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజ్యసభ ఎన్నికల్లో పోటి చేసేందుకు వైగోకు ఎలాంటి అవాంతరం లేదని వాదించారు ఆయన తరఫు న్యాయవాది పి. విల్సన్. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా నెలపాటు శిక్షను వాయిదా వేయాలన్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందు పొత్తుల్లో భాగంగా రాజ్యసభ సీటును ఎండీఎంకేకు ఇచ్చేందుకు డీఎంకేతో ఒప్పందం జరిగింది. ఇదే స్థానంలో పోటీ చేసేందుకు ప్రస్తుతం వైగో సిద్ధపడుతున్నారు.
ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం 2009, జులై 15న చేసిన ఓ పుస్తక విడుదల కార్యక్రమం సందర్భంగా ప్రసంగంలో... శ్రీలంక అంశమై భారత ప్రభుత్వంపై వైగో చేసిన వ్యాఖ్యల ఆధారంగా దేశ ద్రోహం కేసు నమోదు చేశారు.