పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఎడారి మిడతలు మధ్యప్రదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే వందల హెక్టార్లలో పంటను నాశనం చేశాయి. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్‌కు విస్తరించిన ఈ మిడతల దండు దాదాపు 28 జిల్లాలను కమ్మేశాయి.
మధ్యప్రదేశ్‌లోని షియోపుర్, నీముచ్, ఉజ్జయిని, రత్లాం, దేవాస్, అగర్ మాల్వా, రైసెన్, నర్సింగ్పుర్, సెహోరే, హోషంగబాద్, దేవాస్ ఛతర్‌పుర్, సత్నా ప్రాంతాలు మిడతల దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటితో పాటు భోపాల్, ఇండోర్, సాగర్, గ్వాలియర్ ప్రాంతాల్లో సైతం మిడతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక్క బాలాఘాట్ జిల్లాలో 40 వేల హెక్టార్ల పంట నాశనమైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
పెసర పంటపై పంజా
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 వేల హెక్టార్ల పెసర పంట, ఉజ్జయిని జిల్లాలో 60శాతం నువ్వుల పంట, మొరెనా, భిండ్, దైతా జిల్లాల్లో 25 శాతానికిపైగా కూరగాయల పంటలను రైతులు నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా 40-50 శాతం పూల తోటలు ధ్వంసమైనట్లు లెక్కగట్టారు. ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
పంటలను కాపాడుకునేందుకు పాట్లు
లాక్డౌన్ కారణంగా ఇప్పటికే దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ మిడతల బెడద కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు, పంటపొలాలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రాత్రంతా మెలకువగా ఉండి పంటలకు కాపలా కాస్తున్నారు. వంట సామగ్రితో శబ్దాలు చేస్తున్నారు. మిడతలను చెదరగొట్టేందుకు టపాసులు కాలుస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు
మిడతల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యున్నత సమావేశాలు నిర్వహించి చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కమల్ పటేల్ వెల్లడించారు.
"మిడతల నివారణలో కేంద్రానికి చెందిన నాలుగు బృందాలు సైతం సహాయం చేస్తున్నాయి. వ్యవసాయ, అటవీ, పోలీస్ సిబ్బందితో కూడిన బృందాలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశాం. అగ్నిమాపక యంత్రాలతో పెద్ద ఎత్తున పురుగుల మందులు పిచికారీ చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం."
-కమల్ పటేల్, మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి