గుర్తు పెట్టుకోండి.. గెలిచేది మేమే : భాజపా దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ అనంతరం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ మళ్లీ ఆమ్ ఆద్మీకే పట్టం కట్టాయి. మెజారిటీ స్థానాల్లో జయభేరి మోగిస్తుందని స్పష్టం చేశాయి పలు జాతీయ టెలివిజన్ ఛానళ్లు, సంస్థలు.
అయితే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు విరుద్ధంగా స్పందించారు దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ. ఎగ్జిట్ పోల్స్ విఫలమవుతాయని.. గెలిచేది తామే అని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించవద్దని ట్వీట్ చేశారు.
'' ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ విఫలమవుతాయి. నా ట్వీట్‌ను సేవ్ చేసి పెట్టుకోండి. భాజపా 48 సీట్లను గెలుస్తుంది. దిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దయచేసి ఈవీఎంలను నిందించడానికి సాకులు వెతకకండి.''
- మనోజ్ తివారీ, దిల్లీ భాజపా చీఫ్
ఎన్నికల ప్రచారంలో భాగంగా హస్తినలో విస్తృత ప్రచారం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలు.. భాజపా 45 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఉద్ఘాటించారు.
61 శాతం పోలింగ్...
శనివారం జరిగిన ఎన్నికల్లో 61.47 శాతం పోలింగ్ నమోదైంది. తుది సమాచారం ఇంకా రావాల్సి ఉండటంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయి. మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్న ముస్తాఫాబాద్, మటియా మహల్, శీలంపుర్ నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. అయితే.. 2015 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం తగ్గింది. అప్పుడు 67.12 శాతం ప్రజలు.. ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలు గెలుచుకొని భారీ విజయం అందుకుంది. అనంతరం 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఏడుకు ఏడు స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.