మనోహర్ పారికర్... చివరి వరకు ప్రజల కోసమే పరితపించిన గొప్ప నేత. తీవ్ర అనారోగ్యంతో ఉన్నా ఈ ఏడాది జనవరి 27న పనాజీలో అటల్సేతును ప్రారంభించారు. ప్రజల కోసం బాధను పంటిబిగువన అదిమిపట్టి ఉత్సాహంగా ప్రసంగించారు. హౌ ఈజ్ ది జోష్ అంటూ అందరినీ ఉత్తేజపరిచారు. చిరునవ్వులు చిందించారు. అదే నెల 30న రాష్ట్ర బడ్జెట్‌ను స్వయంగా ఆయనే చదివారు. రాష్ట్ర ప్రజల కోసం కష్టాన్ని దిగమింగారు. బాగానే ఉన్నానంటూ అందరికీ ధైర్యం చెప్పారు.ఆయన ధైర్యానికి, నిబద్ధతకు, అంకితభావానికి ఇవి నిదర్శనాలు.
రాజకీయాల్లో పారికర్‌కు ఉన్నతమైన పేరుంది. ప్రత్యేకస్థానముంది. నిరాడంబరుడిగా, ధైర్యశాలిగా, నిజాయతీకి నిదర్శనంగా ఆయనను చాలా మంది కీర్తిస్తారు. పార్టీలకు అతీతంగా నేతలందరూ ఆయనను గౌరవిస్తారు. ఎన్ని ఉన్నతమైన పదవులు చేపట్టినా ఎప్పుడూ సాధారణంగానే ఉండేందుకు ఇష్టపడ్డారు పారికర్.
గోవాను అభివృద్ధి చేసేందుకు నిత్యం కృషి చేశారు పారికర్. అందుకే గోవా ప్రజలకు ఆయనంటే ఎంతో ఇష్టం. ముఖ్యమంత్రిగా ఎంత నిబద్ధతతో పని చేశారో... రక్షణ మంత్రిగానూ తనదైన ముద్రను వేశారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రణాళికలు రచించారు. 'ఇది నయా హిందూస్థాన్' అంటూ గర్జించారు. ముష్కరచేష్టలను సహించేది లేదంటూ గట్టి హెచ్చరికలు పంపారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్ భూభాగంలో లక్షితదాడులు చేసి భారత్ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు.
రాజకీయంగానూ ఎంతో చతురత ఉన్న నేత మనోహర్ పారికర్. గోవాలో సంస్థాగతంగా భాజపాను బలోపేతం చేశారు. 2017లో పార్టీకి మెజార్టీ స్థానాలు రాకపోవడం వల్ల ఆయన మళ్లీ రాష్ట్ర రాజకీయాల వైపునకు వచ్చారు. ఎంతో కృషి చేసి రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోసారి సీఎం పదవిని చేపట్టారు. చివరి వరకు రాష్ట్ర ప్రజలతోనే ఉన్నారు. అనారోగ్యం కారణంగా గోవాలోనే 63ఏళ్లకే అమరుడయ్యారు.
ఇదీ చూడండి:గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూత