తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అభివృద్ధి అజెండా వల్లే మోదీ ప్రభుత్వ విజయం'

2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి సమావేశమైన పార్లమెంట్​ను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్. 2014లో ప్రారంభమైన అభివృద్ధి ఆగిపోకూడదనే మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి గెలిపించారని ఉద్ఘాటించారు. జాతీయ భద్రత, ఒకే దేశం-ఒకే ఎన్నిక వంటి అంశాలపై ఉభయసభల సంయుక్త సమావేశం వేదికగా వ్యాఖ్యానించారు.

'అభివృద్ధి అజెండా వల్లే మోదీ ప్రభుత్వ విజయం'

By

Published : Jun 20, 2019, 8:34 PM IST

Updated : Jun 21, 2019, 12:56 AM IST

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ప్రసంగం

అభివృద్ధి అజెండాతోనే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రభుత్వం అఖండ మెజారిటీ సాధించి మరోసారి అధికారంలోకి వచ్చిందన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. 2014లో ప్రారంభమైన అభివృద్ధి కొనసాగేందుకే ప్రజలు మరోసారి అపూర్వ గెలుపును అందించారన్నారు. గత ప్రభుత్వం సాధించిన విజయాలను పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశం వేదికగా రాష్ట్రపతి గుర్తు చేశారు.

జాతీయ భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్య అంశమని ఉద్ఘాటించారు కోవింద్. పుల్వామా ఘటన అనంతరం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై సైన్యం చేసిన దాడులను గుర్తు చేశారు.

ఉగ్రవాదులను నిరోధించేందుకు సరిహద్దును మరింత బలోపేతం చేస్తాం. ఉగ్రవాదం ఎక్కువగా ఉన్న చోట బాధిత కుటుంబాలను సంరక్షించేందుకు కృషి చేస్తాం. భాష, సాంస్కృతిక, సామాజిక అంశాలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం.
- రామ్​నాథ్​ కోవింద్, రాష్ట్రపతి

సామాజిక దురాచారాలను రూపుమాపే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు కోవింద్. ముమ్మారు తలాక్​, అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వర్గ, మత, సామాజిక వివక్ష లేని సమాజాన్ని 2022 నాటికి నిర్మించాలన్నదే లక్ష్యమన్నారు.

ఒకే దేశం-ఒకే ఎన్నిక అత్యంత ఆవశ్యక అంశమని ఉద్ఘాటించారు కోవింద్. వరుస ఎన్నికల ద్వారా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.

ఒకే దేశం-ఒకే ఎన్నిక తీసుకురానున్నాం. దీని ద్వారా దేశాభివృద్ధి వేగంగా జరిగి ప్రజలు లాభపడతారు. ఈ విధానం ద్వారా ప్రతి రాజకీయ పార్టీ వారి సిద్ధాంతం ప్రకారం ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
- రామ్​నాథ్​ కోవింద్, రాష్ట్రపతి

ఒకే దేశం-ఒకే ఎన్నికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అఖిల పక్షాలతో సమావేశం నిర్వహించిన అనంతరం రాష్ట్రపతి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

21రోజుల నూతన ప్రభుత్వ పాలనలో రైతులు, సైనికులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, మహిళల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుందని స్పష్టం చేశారు కోవింద్.
ఉగ్రవాదంపై భారత్​ పోరులో ప్రపంచ దేశాలు కలిసిరావడంపై హర్షం వ్యక్తం చేశారు కోవింద్.

ఆర్థిక, అంతర్జాతీయ అంశాలైన.. అవినీతి నిర్మూలన, నల్లధనం, విద్యుచ్ఛక్తి వంటి అంశాల్లో ప్రపంచ దేశాలు భారత్​కు మద్దతుగా నిలిచాయి. దేశంలో అతిపెద్ద ఉగ్రదాడికి బాధ్యుడు జైషే మహ్మద్ అగ్రనేత మసూద్ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడం భారత​ దౌత్య విజయానికి నిదర్శనం.
- రామ్​నాథ్​ కోవింద్, రాష్ట్రపతి

2022లోగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తామని పునరుద్ఘాటించారు కోవింద్. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రాబోయే సంవత్సరాల్లో రూ. 25 లక్షల కోట్లను ప్రభుత్వం కేటాయించనుందని స్పష్టం చేశారు.

Last Updated : Jun 21, 2019, 12:56 AM IST

ABOUT THE AUTHOR

...view details