తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరాదిన వరద గుప్పిట్లోనే పలు రాష్ట్రాలు - వర్షాలు

దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినా పలు రాష్ట్రాలు ఇప్పటికీ వరద గుప్పిట్లోనే ఉన్నాయి. దిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. కేరళలో మరో ఇద్దరి మృతితో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 125కు చేరింది.

ఉత్తరాదిన వరద గుప్పిట్లోనే పలు రాష్ట్రాలు

By

Published : Aug 22, 2019, 6:58 AM IST

Updated : Sep 27, 2019, 8:29 PM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ప్రధాన రహదారులపై కొండ చరియలు విరిగిపడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా రోజుల తర్వాత తెరుచుకున్న మనాలీ-లేహ్ రహదారిని తాజా పరిస్థితుల నడుమ మళ్లీ మూసివేశారు అధికారులు.

యమునా నది ఉగ్రరూపం

దిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 15 వేల మందిని ముందస్తుగా పునరావాస శిబిరాలకు తరలించారు అధికారులు. యమునా నది ప్రవహించే దిల్లీలోని ఆరు జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలతో పాటు.. నదిపై ఉన్న పురాతన వంతెన లోహెవాలా పూల్ పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వరద బాధితుల కోసం తీర ప్రాంతాల్లో 30 పడవలను అందుబాటులో ఉంచారు.

జలదిగ్బంధంలో పంజాబ్​

పంజాబ్‌లోని జలంధర్‌లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. సట్లెజ్ నదిలో నీటి ప్రవాహం పెరిగినందున పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వరద బాధితులకు సైనిక హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. భాక్రా డ్యాం నుంచి భారీగా వస్తున్న వరద నీటితో దిగువనున్న జలంధర్, లుధియానా, ఫిరోజ్‌పుర్, రూప్‌నగర్ ప్రాంతాలు నీటమునిగాయి. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

కేరళలో 125కు మృతుల సంఖ్య

కేరళలో వరదలు తగ్గుముఖం పట్టినందున అధికారులు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. తాజాగా మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఫలితంగా కేరళలో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 125కు చేరింది. మలప్పురం, వయనాడ్‌లలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో గల్లంతైన 17 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటివరకు మలప్పురంలో 60 మంది మరణించగా వయనాడ్‌లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తర్‌ప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన రుతుపవనాలతో రానున్న నాలుగు రోజుల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Last Updated : Sep 27, 2019, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details