మోటారు వాహనాల చట్టం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక... ప్రతిచోట ట్రాఫిక్ చలానాల గురించే చర్చ. నియమాలు ఉల్లంఘించినవారికి జరిమానాలు భారీగా ఉండడమే ఇందుకు కారణం. దిల్లీలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే... భారీ జరిమానాతో ఆగలేదు. ద్విచక్రవాహనం మొత్తం కాలి బూడిదైంది.
చిరాగ్ దిల్లీ ప్రాంతానికి చెందిన రాకేశ్ గురువారం బైక్పై వెళ్తుండగా పోలీసులు ఆపారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. కొత్త నిబంధనల ప్రకారం అతడికి రూ.10వేలు జరిమానా విధించారు.
అంతటి జరిమానా చూసి రాకేశ్ కంగుతిన్నాడు. అసలే మద్యం మత్తులో ఉన్న అతడు... విచక్షణ కోల్పోయాడు. పోలీసులు బైక్ను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో కోపోద్రిక్తుడయ్యాడు. పెట్రోల్ ట్యాంకు తెరిచి, నిప్పంటించాడు. ఈ ఘటనతో పోలీసులు నివ్వెరపోయారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలు ఆర్పారు.