అతడికి శునకాలంటే ప్రాణం. విదేశాల నుంచి తెప్పించిన శునకాలకు అక్కడి ఉష్ణోగ్రతలు కల్పించాలని భావించినట్టున్నాడు. మహారాష్ట్ర నవీముంబయిలోని తన ఇల్లంతా ఏసీలు ఏర్పాటు చేశాడు. వాటికి అనువైన విధంగా ఏసీలను ట్యూన్ చేస్తుండేవాడు. ఇల్లంతా సరిపోయేంత ఏసీ అంటే విద్యుత్ బిల్లు భారీగానే వస్తుంది కదా! ఈ ఖర్చును తప్పించుకునేందుకు విద్యుత్ చోరీకి పాల్పడ్డాడు ఆ వ్యక్తి.
శునకాలకు ఏసీ సౌకర్యం కల్పించడం కోసం విద్యుత్ దొంగతనానికి పాల్పడుతున్నాడని సమాచారం అందుకున్నారు మహారాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు. నిందితుడిని పట్టుకున్నారు. 34, 465 యూనిట్ల విద్యుత్ అక్రమంగా ఖర్చు చేశాడని నిర్ధరించి.. రూ. 7 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే జరిగే పరిణామాలు తెలిసిన ఈ శునక ప్రియుడు కిక్కురుమనకుండా జరిమానా కట్టేశాడని చెప్పారు అధికారులు.