హోటల్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు బెదింపులకు పాల్పడిన ఘటన పశ్చిమ దిల్లీలోని హరినగర్‌లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఓ స్థానిక హోటల్ ఆరో అంతస్తుపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడో యువకుడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యువకుణ్ని కిందకు దించే ప్రయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకోవద్దని ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ అందుకు అతను నిరాకరించాడు. కిందకు దిగనంటే దిగను అని మొండికేసుకు కూర్చున్నాడు. తాను కిందకు దిగాలంటే తనపై ఉన్న కేసులను కొట్టివేయాలనే డిమాండ్ చేసినట్లు సమాచారం.
18 గంటల పాటు..
రాత్రంతా హోటల్ వద్ద ఉన్న అధికారులు సుమారు 18 గంటల పాటు శ్రమించి సోమవారం ఉదయానికి అతడి ఆలోచనలో మార్పు తీసుకొచ్చారు. 9 గంటల ప్రాంతంలో సురక్షితంగా కిందకు తీసుకురావటం వల్ల కథ సుఖాంతమయింది.
టిక్ టాక్ యాప్‌లో యాక్టివ్‌గా ఉండే ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరింపులకు పాల్పడుతున్న సమయంలో 3 వీడియోలను పోస్ట్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.