వివరాల్లోకి వెళ్తే... తిరువరూర్ జిల్లాలోని మరుథవనమ్ గ్రామంలో నివసించే శివకుమార్, అరుల్ మోజీ దంపతులకు ఇద్దరు సంతానం. పూల వ్యాపారంలో రోజుకూలీగా పనిచేసేవాడు శివకుమార్. ఆయన ఆదాయం అంతంత మాత్రమే. కనీసం నిత్యావసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితి.
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. పిల్లల ముందే ఎప్పుడూ గొడవపడేవారు. కుమార్తె నదియా సమీప ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. తన తండ్రి ఎప్పుడూ తల్లితో గొడవపడుతుండటంపై విసుగుచెందిన నదియా తండ్రితో మాట్లాడటం మానేసింది.
ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యేసరికి శివకుమార్ సమీపంలోని తిర్పూర్ వెళ్లి పని వెతుక్కున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఇంటికొచ్చేవాడు. కానీ నదియా అతనితో మాట్లాడేది కాదు. 6 నెలలు గడిచాయి. తండ్రీ కుమార్తెల మధ్య మాటల్లేవు. ఒకరోజు తనతో మాట్లాడాలంటే ఏమి చేయాలని కుమార్తెను అడిగాడు శివకుమార్. పాఠశాల సమీపంలోని చెరువును శుభ్రం చేస్తే మాట్లాడతానని చెప్పింది. కుమార్తె కోరిక మేరకు భార్యభర్తలు ఇద్దరు చెరువును పరిశుభ్రంగా మార్చారు.