బంగారం అక్రమ రవాణాపై దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. అయితే.. పోలీసుల కళ్లుగప్పి వివిధ మార్గాల ద్వారా పసిడిని అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు దుండగులు. ఈ క్రమంలోనే కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు సీఐఎస్ఎఫ్ అధికారులు. గుర్రం పేడ ఉన్న నాలుగు సంచుల్లో సుమారు రూ.8.20 లక్షల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.
అంగుస్వామి రామయ్య(41) అనే వ్యక్తి మయన్మార్ నుంచి భారత్ వచ్చారు. నాలుగు సంచులతో చెన్నైకి వెళ్లే విమానం పట్టుకునేందుకు అనుమానంగా తిరుగుతున్న రామయ్యను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. తీరా సంచుల్లోని గుర్రంపేడలో బంగారం చూసి అవాక్కయ్యారు. రామయ్య నుంచి సుమారు 215 గ్రాముల పసిడి దొరికింది. 162.1 గ్రాముల బరువైన 4 కడ్డీలు గుర్రం పేడలో ఉండగా.. మరో కడ్డీ అతని పర్సులో దొరికింది.