బంగాల్ గవర్నర్‌గా ఐదేళ్ల పాటు సేవలందించిన కేసరినాథ్ త్రిపాఠి.. సీఎం మమతా బెనర్జీ విధానాలపై పరోక్ష విమర్శలు చేశారు. పాలనా సమర్థత ఉన్న దీదీ వ్యక్తిగత మనోభావాలను అణుచుకోలేరని వ్యాఖ్యానించారు. పదవీ విరమణ చేయబోయే ముందు ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో అనేక విషయాలపై మాట్లాడారు త్రిపాఠి.
"మమతా బెనర్జీ అనుసరిస్తున్న బుజ్జగింపు విధానాలతో రాష్ట్రంలో సామాజిక సామరస్యం దెబ్బతింటోంది. తీసుకున్న నిర్ణయాలను అమలు చేయగలిగే శక్తి, అభివృద్ధి దృక్పథం మమతకు ఉన్నాయి. అయితే ఆమె వ్యక్తిగత మనోభావాల విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సామాజిక సామరస్యం ఏర్పడాలంటే అందరినీ సమానంగా చూడాలి. చాలా సందర్భాల్లో తన మనోభావాలకు మమత ప్రభావితమైపోతారు. నియంత్రణ పాటించాలి."
-కేసరి నాథ్ త్రిపాఠి, బంగాల్ గవర్నర్
గవర్నర్‌గా ఐదేళ్ల కాలంలో దీదీతో అనేక సందర్భాల్లో వివాదాస్పద పరిస్థితులను ఎదుర్కొన్నారు త్రిపాఠి. భాజపా ప్రోద్బలంతో ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని పలుమార్లు విమర్శించారు దీదీ. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నారని ఆరోపించారు. వీటిపైనా త్రిపాఠి స్పందించారు.
"రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన సామాజిక వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో తరచుగా చోటుచేసుకుంటున్న హింసాయుత పరిస్థితులు ఆందోళనకరం. శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరిచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అసలు ప్రజలు ఎందుకు హింసాకాండకు ఒడిగడుతున్నారో అర్థం కావడంలేదు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉండి ఉండొచ్చు. అలాగే మతపరమైన కారణాలు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వలస రావడం కూడా ఈ హింసాకాండకు కారణం కావచ్చు."
- కేసరినాథ్ త్రిపాఠి, బంగాల్ గవర్నర్
రాష్ట్రంలో శాంతిభద్రతల విషయాన్ని అదుపు చేయటానికి రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉందా? అనే అంశంపైనా వివరణ ఇచ్చారు త్రిపాఠి.