2014 సార్వత్రికంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ ఏకంగా 34 లోక్సభ స్థానాలు నెగ్గింది. భాజపా అప్పుడు 2 స్థానాలకే పరిమితమైంది. 2019కి వచ్చేసరికి 23 సీట్లు గెలవాలని నిర్దేశించుకున్న అదే భాజపా లక్ష్యానికి చాలా చేరువగా వచ్చింది. ఈ భాజపా మిషన్ పూర్తిగా సాకారం కాకపోయినా.. 18 సీట్లు నెగ్గి అడుగుదూరంలో నిలిచిపోయింది. గత సార్వత్రికం కంటే 9 రెట్లు మెరుగైన ఫలితాలను సాధించింది. కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది.
భాజపా దూకుడుతో రాష్ట్రంలో టీఎంసీ ఏకచ్ఛత్రాధిపత్యానికి దాదాపు తెరపడినట్లే. వామపక్షాల ఉనికి అన్నది లేకుండా చేసి 8 ఏళ్ల క్రితం ఇక్కడ అధికారంలోకి వచ్చిన దీదీకి బంగాల్ ఫలితాలు పెద్ద దెబ్బే.
ప్రభుత్వంపై వ్యతిరేకత..
బంగాల్లో తృణమూల్ ఆధిపత్యం సన్నగిల్లడానికి కారణాలు అనేకం. మొదటిది 8 ఏళ్ల మమత పాలనపై వ్యతిరేకత. ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని.. శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారనే విమర్శలు ఎదుర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, భాజపా కార్యకర్తలపై దాడులూ టీఎంసీకి ప్రతికూలంగా మారాయి.
హిందుత్వ వాదంతో భాజపా...
హిందూ ఓటుబ్యాంకును ఆకర్షించేందుకు భాజపా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీదీని దెబ్బకొట్టడానికి.. కొన్ని స్థానాల్లో వామపక్షాలు భాజపాకు అనుకూలంగా వ్యవహరించాయన్న విశ్లేషణలున్నాయి.
కొంతకాలంగా బంగాల్లో పార్టీని విస్తరించి.. కార్యకర్తలు, ప్రజాబలాన్ని పెంచుకుంది కాషాయ పార్టీ. ముస్లిమేతరుల వలస జీవులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు తెచ్చిన జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు, బంగ్లా వలసదారుల ఏరివేత నిర్ణయాలు వారికి మేలు చేశాయి. మోదీ-షా ద్వయం విస్తృత ప్రచారం బంగాల్లో భాజపా విజయానికి కృషిచేశాయి.
అభివృద్ధి అజెండానే...
నోట్లరద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో భాజపా పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. జాతీయవాదం, దేశ భద్రత, గ్రామీణ విద్యుదీకరణ, ఇళ్ల నిర్మాణాలు, గ్యాస్ కనెక్షన్లు వంటివి భాజపాకు లాభించాయి. దీదీ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లో బలంగా చాటారు మోదీ, షా.
భాజపా ప్రభంజనం ముందు రాష్ట్రంలో వామపక్షాల ఉనికీ ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్ పార్టీ కూడా బంగాల్లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది.
ఇదీ చూడండి:
'ప్రజాతీర్పు నవభారత ఆకాంక్షలకు ప్రతీక'