దేశంలో కొవిడ్ కోరలు చాస్తోంది. వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కొత్తగా 9,601 కేసులు నమోదయ్యాయి. మరో 322మంది వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,719కి చేరింది. ఇప్పటివరకు 15,316మంది ప్రాణాలు కోల్పోయారు. 2,66,883 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
తమిళనాడులో 4వేలు దాటిన మృతులు
తమిళనాడులోనూ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కొత్తగా 5,879 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 2,51,738కి పెరిగింది. మరో 99 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 4 వేలు దాటింది. అయితే ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,90,966 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.
కర్ణాటకలో 5వేలకుపైగా..
కర్ణాటకలో వరుసగా తొమ్మిదో రోజూ రికార్డు స్థాయిలో 5వేలకుపైగా వైరస్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా 5,172 మంది వైరస్ బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 1,29,287కు పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో 98 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,412కు చేరింది. వైరస్ నుంచి కోలుకుని 53,648 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 73,219 మంది చికిత్స పొందుతున్నారు.
యూపీలో ఇలా..
ఉత్తర్‌ప్రదేశ్‌లో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది కరోనా. 3,807 కొత్త కేసులు వెలుగు చూడగా.. మొత్తం బాధితుల సంఖ్య 89,068కి చేరింది. మరో 47 మంది వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,677కు పెరిగింది. ఇప్పటివరకు 51,354 మందికి వైరస్ నయమవగా.. మరో 36,037 మంది చికిత్స పొందుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దిల్లీలో అలా..
దేశ రాజధాని దిల్లీలో తాజాగా 1,118 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,36,716కు పెరిగింది. మరో 26 మంది వైరస్ ధాటికి బలవ్వగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,989కి చేరింది. వైరస్ బారినపడిన వారిలో 1,22,131 మంది కోలుకోగా.. 10,596 మంది ఆయా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
గుజరాత్లో వెయ్యికిపైగా
గుజరాత్లో 24 గంటల్లో 1,136 కొవిడ్ కేసులు బయటపడగా.. మొత్తం బాధితుల సంఖ్య 62,574కి చేరింది. మరో 24 మంది వైరస్‌కు బలవ్వగా.. మరణాల సంఖ్య 2,465కి పెరిగింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 45,782 మంది కోలుకున్నారు. 14,327 మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:దిల్లీలో 50 రోజులకు పెరిగిన కరోనా డబ్లింగ్ రేటు