తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'సంగ్రామం: భాజపా జైత్రయాత్ర కొనసాగేనా..? - కాంగ్రెస్​

సార్వత్రిక సమరం తర్వాత దేశంలో మరో రసవత్తర ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటనతో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా మరాఠా గడ్డపై పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇక్కడ కీలకంగా ఉన్న 4 పార్టీలు సమరానికి సై అంటున్నాయి. భాజపా, శివసేన ఒక జట్టుగా... కాంగ్రెస్‌, ఎన్సీపీ మరో కూటమిగా బరిలోకి దిగి పరస్పరం సవాలు విసురుకుంటున్నాయి.

'మహా'సంగ్రామం: భాజపా జైత్రయాత్ర కొనసాగేనా..?

By

Published : Oct 2, 2019, 6:36 PM IST

Updated : Oct 2, 2019, 10:07 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

మరాఠా శాసనససభ సంగ్రామంలో పైచేయి సాధించి అధికారం చేపట్టేందుకు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. భాజపా-సేన కూటమి మరోసారి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది. వరుస ఓటములతో కుదేలైన కాంగ్రెస్‌ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఎన్సీపీ గత వైభవాన్ని దక్కించుకోవాలని ఆశిస్తోంది.

దేశంలో జనాభాపరంగా ఉత్తర్​ప్రదేశ్​ తర్వాత రెండో అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఉత్తర్​ప్రదేశ్(403)​, బంగాల్(294)​ తర్వాత ఎక్కువ అసెంబ్లీ స్థానాలు(288) ఉన్నది ఇక్కడే. యూపీ తర్వాత లోక్​సభకు ఎక్కువ మంది ఎంపీలను పంపుతున్నది మహారాష్ట్రనే. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా... ఈ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంటుంది.

మహారాష్ట్ర శాసనసభ గడువు నవంబర్​ 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్​ 21న ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు ప్రకటించనున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల ముఖచిత్రం

మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్​

రాజకీయం...

దశాబ్దాల పాటు మహారాష్ట్ర కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉండేది. అయితే 1995లో తొలిసారి హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పూర్తిస్థాయి కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పాటైంది. శివసేన నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు పాలన సాగించగా, ఆ పార్టీ 1999లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. అనంతరం 15 ఏళ్లు కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ)లు కలిసి పాలన సాగించాయి.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా ఇప్పుడు మరోసారి అదే జట్టుగా దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.

అప్పుడూ... ఇప్పుడూ...

ఐదేళ్ల క్రితం శాసనసభ ఎన్నికల్లో 4 ప్రధాన పార్టీలు భాజపా, సేన, కాంగ్రెస్​, ఎన్సీపీలు వేర్వేరుగా తలపడ్డాయి. 15 ఏళ్లు కలిసి ఉన్న.. కాంగ్రెస్​, శరద్​పవార్​కు చెందిన ఎన్సీపీలు తమ సొంత బలాలపై అతి విశ్వాసంతో ఒంటరిగానే బరిలోకి దిగాయి. అయితే.. సీన్​ రివర్సయింది. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణ భాజపాకు ఓట్లు తెచ్చిపెట్టి... అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా నిలిచింది. శివసేన, కాంగ్రెస్​, ఎన్సీపీ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వీటి పరిస్థితి మరీ ఘోరం. 48 స్థానాలకు గానూ కాంగ్రెస్​, ఎన్సీపీలు కలిపి ఐదు స్థానాలకే పరిమితమయ్యాయి. భాజపా 23, సేన 18 సీట్లు గెల్చుకొని ప్రభంజనం సృష్టించాయి.

పొత్తులు

కూటమిలోనే ఉంటూ అధికార భాజపాపై విమర్శలు గుప్పించే శివసేన... మరోసారి ఆ పార్టీతోనే కలిసి రంగంలోకి దిగుతోంది. అగ్రనేతలు చర్చించుకుని... భాజపాకు 164, శివసేనకు 124 స్థానాలు ఖరారు చేసుకున్నారు. అయితే.. ఇక్కడ చిన్న పార్టీలకు భాజపా కోటా నుంచి సీట్లు కేటాయించాల్సి ఉంది. ఈ రెండు ప్రధాన పార్టీలు భాజపా(125), సేన(70) మందితో తమ తొలి జాబితాలనూ విడుదల చేశాయి. కూటమిలో రిపబ్లికన్​ పార్టీ ఆఫ్​ ఇండియా(ఏ), రాష్ట్రీయ సమాజ్​ పక్ష్​, శివ్​సంగ్రామ్​ సంఘటన, రాయల్​ క్రాంతి సేన వంటి చిన్న పార్టీలూ ఉన్నాయి.

  • దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో మొత్తం 36 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా-19, శివసేన-17 చోట్ల బరిలోకి దిగనున్నాయి.
  • ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నాగ్‌పుర్‌ సౌత్‌వెస్ట్‌ నుంచి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ పుణెలోని కొత్రుద్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుటుంబానికి చెందిన శివేంద్ర సింగ్‌ను సతారా నుంచి భాజపా పోటీకి నిలుపుతోంది.
  • శివసేన చరిత్రలోనే తొలిసారిగా ఠాక్రే కుటుంబం నుంచి పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే తనయుడు.. ఆదిత్య ఠాక్రే ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నారు. ఆయన దక్షిణ ముంబయిలోని వర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

విపత్తులు... సమస్యలు...

ఎన్నికల వేళ మహారాష్ట్రను మాత్రం విపత్తులు కుదిపేస్తున్నాయి. సగం రాష్ట్రంలో వరదలు ముంచెత్తాయి. అపార నష్టం వాటిల్లింది. మరఠ్వాడాలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. పలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం, యువతలో అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఇవి ఎన్నికలపై ఏ మేర ప్రభావం చూపుతాయన్నది అసలు ప్రశ్న.

మళ్లీ కమల వికాసమేనా...?

ఈ సారి ఎన్నికల్లో భాజపాయే మెరుగ్గా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే ఈ అంచనాలకు కారణం. భాజపా, శివసేన కూటమి 50 శాతానికి పైగా ఓట్లు సాధించింది. దాదాపు 230 అసెంబ్లీ స్థానాల పరిధిలో విజయఢంకా మోగించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తుపెట్టుకుని ఇదే పట్టును కొనసాగిస్తే ప్రతిపక్షాలు 50 సీట్లకే పరిమితమవుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కలిసొచ్చేనా!

కలిసి ఉంటే కలదు సుఖం అన్నది ఇప్పుడు కాంగ్రెస్‌, ఎన్సీపీకి అవగతమైనట్లు కనిపిస్తోంది. తమ పార్టీల సహజ వైఖరికి భిన్నంగా.. ఎన్నికలకు రెండు నెలల ముందే సీట్ల సర్దుబాటుపై సోనియాగాంధీ, శరద్‌ పవార్‌ ఓ ఒప్పందానికి వచ్చారు. అయితే గత 6 నెలలుగా ఆ పార్టీలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. దాదాపు 30 మంది తాజా, మాజీ ఎమ్మెల్యేలు భాజపా, శివసేనలో చేరిపోయారు. దీంతో ఆ పార్టీలు కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అవి బలాన్ని పుంజుకుని ఎలా పోరాడుతాయో చూడాలి.

Last Updated : Oct 2, 2019, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details