తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: మహాకూటమికి ఏమైంది? - కాంగ్రెస్

దేశమంతా పొత్తులపై విస్తృత చర్చలు జరిగాయి. భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్​ సహా 22 పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. సమావేశాలు, చర్చలు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హడావుడి చేశాయి. ఇదంతా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు చిత్రం. అసలు సినిమా మొదలయ్యాక... ఆ జోరు కనిపించడంలేదు. ఎందుకు? మహాకూటమికి ఏమైంది?

భారత్​ భేరి: మహాకూటమికి ఏమైంది?

By

Published : Mar 27, 2019, 6:30 PM IST

ప్రతిపక్షాల ఐక్యత ఏమైంది?
ప్రతిపక్షాల ఐక్యత...! ఎన్నికల ముందు బాగా వినిపించే మాట. ఈసారీ అలానే వినపడింది. మహాకూటమి ఏర్పడింది.

ఆరంభంలో దేశమంతా మహాకూటమి హడావుడే. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. ఎన్నికల షెడ్యూల్​​ విడుదల కాగానే అంతటా ప్రశాంతత ఆవరించింది. ముందున్న జోరు ఇప్పుడు కనిపించడంలేదు. ప్రాంతీయ పార్టీల నేతలు తమ రాష్ట్రాలను దాటి బయటకు రావట్లేదు.

ఇదీ చూడండి:కాంగ్రెస్​ 'మెరుపు దాడిపై' దేశం మాటేంటి..?

అనుకున్నది ఒకటి...

మహాకూటమి గురించి మొదట్లో రకరకాల విశ్లేషణలు వినిపించాయి. జాతీయస్థాయిలో పొత్తులు, సీట్ల సర్దుబాటు కాకుండా.... రాష్ట్రస్థాయిలో ఒప్పందాలు ఉంటాయని చెప్పారు. అప్పుడు సార్వత్రిక సమరం మొత్తం చిన్నచిన్న యుద్ధాలుగా మారిపోతుందని విశ్లేషించారు. లోక్​సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీయే ప్రధానాంశం కాకుండా చూసేందుకు ఇదే సరైన ఎత్తుగడని అప్పట్లో అన్నారు.

అత్యంత కీలకమైన ఉత్తర్​ప్రదేశ్​లో ఎస్పీ, బీఎస్పీ సొంతంగా కూటమి ఏర్పాటుచేసుకోవడం, కాంగ్రెస్​ను దూరం పెట్టడం... మహాకూటమికి మొదటి దెబ్బ. మిగిలిన పార్టీల్లోనూ ఐక్యత లోపించడం రెండోది. కూటమిలో భాగస్వాములుగా ఉంటూ... రాష్ట్రస్థాయిలో పొత్తులు పెట్టుకున్న పార్టీలను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. బిహార్​లో ఆర్జేడీ... కర్ణాటకలో జేడీఎస్... తమిళనాడులో డీఎంకే మాత్రమే కాంగ్రెస్​తో జట్టుకట్టాయి. ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశానిది ఒంటరి పోరే. దిల్లీలో ఆమ్​ఆద్మీ పార్టీ, కాంగ్రెస్​కు పొత్తు కుదరలేదు. బంగాల్​లో కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​ ప్రత్యర్థులు.

సర్దుబాట్లతో తప్పిన లక్ష్యం

పొత్తు రాజకీయాల్లో పట్టువిడుపులు ఎంతో అవసరం. ఈ విషయంలో కూటమి పార్టీలేవీ వెనక్కి తగ్గకపోవడం ప్రతికూల ప్రభావం చూపింది.

"సీట్ల పంపకాల అధికారాన్ని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ రాష్ట్ర నేతలకు ఇచ్చేశారు. అందుకే ఇతర పార్టీలతో చర్చలు సఫలం కాలేదు. ప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయంలో రాహుల్​ గాంధీ రాష్ట్రాల నేతలకు సర్దిచెప్పలేకపోతున్నారు. పొత్తుల అంశంలో రాష్ట్రాల్లో చర్చలు విఫలమవడానికి బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ కూడా కారణమే.

నేతలు స్థానిక అజెండాలతోనే ముందుకెళుతున్నారు. దూర, విస్తృత దృష్టితో ఆలోచించడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడం లేదు. వాళ్లంతా భాజపాకు వ్యతిరేకమే. కానీ సీట్లు త్యాగం చేసేందుకు, సర్దుబాటు చేసుకునేందుకు మాత్రం సిద్ధంగా లేరు."

-- సురవరం సుధాకర్​ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి

స్వప్రయోజనాలే పరమావధి!

సీపీఐ మహాకూటమిలో భాగస్వామి. అయినా... మిత్రపక్షాల తీరును సురవరం ఈ స్థాయిలో తప్పుబట్టడానికి కారణం... బిహార్​లో ఆ పార్టీకి ఎదురైన అనుభవం.

జేఎన్​యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్​ కోసం బెగూసరాయ్​ స్థానం ఇవ్వాలని కోరింది సీపీఐ. కూటమిలో ప్రధాన పక్షమైన ఆర్​జేడీ అందుకు నిరాకరించింది. కన్నయ్య కుమార్​ సామాజిక వర్గం... విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాదించింది. లాలూ ప్రసాద్​ కుమారుడు తేజస్వీ యాదవ్​ ఎదుగుదలకు కన్నయ్య అడ్డంకి అవుతారన్న భయంతోనే టికెట్​ నిరాకరించారన్న విశ్లేషణలు వినిపించాయి. చివరకు... కూటమితో సంబంధం లేకుండా కన్నయ్యను పోటీకి నిలబెట్టింది సీపీఐ. మహాకూటమి మరో అభ్యర్థిని బరిలోకి దింపుతోంది.

"వారు రాజకీయ అవసరాలు చూడడం లేదు. కులాన్ని మాత్రమే చూస్తున్నారు. రాజకీయాలు, ఎన్నికలు అంటే కులం మాత్రమే కాదు. రాజకీయం ఎంతో అవసరం. కులం.. వాస్తవం. ఫలితంపై కులం ప్రభావం ఉండొచ్చు. కానీ అదే పరమావధి కాదు. రాజకీయాల్ని కులం కోణంలో మాత్రమే చూడడం సంకుచిత ఆలోచనే అవుతుంది. బిహార్​లో అదే జరిగింది."

-- సురవరం సుధాకర్​ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి

రాజీ ప్రయత్నాలు, విజయావకాశాలపై విశ్లేషణలు లేకుండా మహాకూటమిలోని పార్టీలే ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించాయి. ప్రత్యర్థి పైచేయి సాధించేందుకు అవకాశం ఇచ్చాయి.

అగ్రనేతలదీ అదే తీరు...

కీలక పార్టీల అగ్రనేతల మాటలు... మహాకూటమి ఐక్యతపై అనుమానాలకు తావిస్తున్నాయి.

"తృణమూల్​ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పాలనలో ప్రజలు కష్టాల్లో జీవిస్తున్నారు. దీదీ రైతులకు, యువతకు ఏమీ చేయలేదు. నిరుద్యోగ సమస్య అలాగే ఉంది. మమతా బెనర్జీ మీకు ఏమి చేశారో ఒక్కసారి చెప్పండి. ఓవైపు ప్రధాని మోదీ ప్రజలను మోసం చేస్తుంటే... మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతున్నారు."

-- రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​ రెండూ మహాకూటమిలో భాగస్వాములే. రాష్ట్రస్థాయిలో మాత్రం ప్రత్యర్థులు. లోక్​సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు మమతపై రాహుల్​ నేరుగా విమర్శలు సంధించడం చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్​, టీఎంసీ కలిసి పనిచేస్తున్నా... ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో మాత్రం రెండు పార్టీల మధ్య చాలా దూరం ఉంది. కాంగ్రెస్​ నేతల దృష్టిలో ప్రధాని అభ్యర్థి రాహుల్​ గాంధీనే. తృణమూల్​ నేతలకు మాత్రం మమత. ఇన్ని భేదాభిప్రాయాలతో ఉన్న ప్రధాన పార్టీలు... కూటమిలో కడవరకు ఎలా కలిసి నడుస్తాయన్నదే ప్రశ్న.

అసలు వ్యూహం మరొకటి!

"జాతీయ స్థాయిలో కూటమి సాధ్యం కాదని ముందే చెప్పాం. రాష్ట్రస్థాయిలో ప్రతిపక్షాల మధ్య కూటములు ఉంటాయని భావించాం. ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, దిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇది సాధ్యం కాలేదు. ఇది కొంచెం ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవడమే మార్గం.

భాజపాయేతర, భాజపా వ్యతిరేక పార్టీలు అత్యధిక లోక్​సభ స్థానాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని నమ్మకంతో ఉన్నా."

-- సురవరం సుధాకర్​ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి

మహాకూటమిలోని పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు గెలవడం ఇప్పుడు సవాలు. సంఖ్యాబలం సాధించినా... ప్రధాని ఎవరనే విషయంలో ఏకాభిప్రాయానికి రావడం అసలు పరీక్ష.

"విపక్షాలు 2019 కోసం వ్యూహాలు రచించడంలేదు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అస్తిత్వం కాపాడుకోవాలని అనుకుంటున్న అన్ని పార్టీల అసలు అజెండా ఇదే. ఈ ఎన్నికల్లో భాజపాకు పూర్తి మెజారిటీ రాదన్నది వారి అంచనా. అలా జరిగితే మిగతా వారి మద్దతు కోరుతుంది. ఈ తరుణంలో భాజపా వైపే ఉదారంగా ఉండాల్సి వస్తోంది. కాంగ్రెస్‌కు కూడా ప్రస్తుతానికి పెద్ద నష్టమేమీ లేదు కాబట్టి నెమ్మదిగా బలపడాలని చూస్తోంది. రాజకీయాల్లో దూరదృష్టితో పెద్ద వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుంది."

-- శశిధర్‌ పాఠక్‌, సీనియర్‌ పాత్రికేయుడు

ఇవీ చూడండి :

వీళ్లు పోటీకి దూరం- వాళ్లకు విజయం దూరం

భారత్​ భేరి: 5% ఓట్లు ఫేస్​బుక్​, ట్విట్టర్​వే!

ABOUT THE AUTHOR

...view details