మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లేనని భాజపా వర్గాలు వెల్లడించాయి. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైందని కమలం పార్టీ నేత ఒకరు తెలిపారు. ముఖ్యమంత్రి పీఠంపై తాము వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా నుంచి తమతో ఎవరూ సంప్రదింపులు జరపలేదని సేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వద్దకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు.
రెండురోజుల్లో ప్రభుత్వం!
ప్రభుత్వ ఏర్పాటుపై రెండురోజుల్లో భాజపా-సేన సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని భాజపా నేత చెప్పారు. నవంబరు 9 లోపే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి.. శివసేనతో సంప్రదింపులు పూర్తయినట్లేనని పేర్కొన్నారు. అయితే ఏ హామీతో శివసేనను బుజ్జగించారనే విషయంపై మాత్రం భాజపా నేత స్పష్టత ఇవ్వలేదు.