మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాసనసభలో రేపు బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు బహిరంగ బ్యాలెట్ విధానంలో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
'మహా' బలపరీక్ష రేపే... సుప్రీంకోర్టు కీలక తీర్పు - మహారాష్ట్రపై సుప్రీం కోర్టు తీర్పు
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్ సర్కార్‌కు బల పరీక్షపై ఉత్కంఠ వీడింది. బుధవారం బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రొటెం స్పీకర్‌ను తక్షణం నియమించాలని గవర్నర్ కోశ్యారికి సూచించింది. రేపు సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష ప్రక్రియ పూర్తిచేయాలని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఈలోపు ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని, బలపరీక్ష ఒక్కటే అజెండాగా సమావేశం జరగాలని సూచించింది సుప్రీంకోర్టు. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం బలపరీక్షను ప్రొటెం స్పీకర్ నిర్వహించాలని ఆదేశించింది. బలపరీక్ష మొత్తం వీడియో తీయాలని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిలో రాజ్యాంగ నైతికతను అన్ని పక్షాలు కాపాడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం వాదనలు ముగిశాయి. నేడు తీర్పు వెలువడింది.
- ఇదీ చూడండి: ముంబయి దాడికి 11 ఏళ్లు- అమరులకు ఘన నివాళులు