దేశంలో మిగతా రాష్ట్రాలకన్నా మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 20 శాతం కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది ఠాక్రే ప్రభుత్వం. ఈ యుద్ధంలో తాజాగా మరో వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.
మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో నిర్ధరణ పరీక్షల్లో వేగం పెంచాలని మహా సర్కారు భావించింది. ఇందుకు అనుగుణంగా రాపిడ్ టెస్టులకు మొగ్గు చూపింది. రక్త నమూనాలతో ఒకే సారి భారీ సంఖ్యలో నిర్ధరణ పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపింది.
కేంద్రం అనుమతి..
మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్ర సర్కారు ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ థోపే తెలిపారు. ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ మేరకు అనుమతించినట్లు వెల్లడించారు.
"రాపిడ్ పరీక్షల్లో ముక్కు, నోరు స్రావాలకు బదులుగా రక్త నమూనాలను వినియోగిస్తాం. దీని ద్వారా 5 నిమిషాలలోపే ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు బాధితుడి శరీరం ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసిందా లేదా అన్న విషయమూ తెలుస్తుంది.
ఇందుకు ప్రధాని అనుమతి లభించింది. తొలుత రాపిడ్ టెస్టులకు కేంద్రం అనుమతి నిరాకరించింది. "
-రాజేశ్ థోపే, మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి