మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు 17మంది అదృశ్యమవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో నేడు భాజపా శాసనసభాపక్షం సమావేశం కానుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది భాజపా.
అయితే రెబల్ ఎమ్మెల్యేలు కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలోని ఓ ప్రైవేటు రిసార్టుకు చేరుకున్నారని సమాచారం. రెబల్ శాసనసభ్యులు కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన వారని సమాచారం. ప్రస్తుతం సింధియా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటం, శాసనసభ్యులు ప్రత్యేక విమానంలో బెంగళూరు రిసార్టుకు చేరడం ప్రభుత్వ మనుగడపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు సీఎం కమల్‌నాథ్ ఇంటిలో అత్యవసర భేటీ నిర్వహించారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం తీసుకున్నారు సీఎం కమల్‌నాథ్.
230 సీట్లున్న అసెంబ్లీలో అధికార కమల్‌నాథ్ ప్రభుత్వానికి 120మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో కాంగ్రెస్ 114, బీఎస్పీ 2, సమాజ్వాదీ పార్టీకి ఒక శాసనసభ్యుడు ఉన్నారు. మరో నలుగురు స్వతంత్రులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. భాజపాకు 107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో 17మంది ఎమ్మెల్యేల అదృశ్యం రాజకీయంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.