వేలూరు లోక్సభ ఎన్నిక రద్దు ఏప్రిల్ 18న జరగాల్సిన తమిళనాడు వేలూరు లోక్సభ ఎన్నికను ఈసీ రద్దు చేసింది. నియోజకవర్గంలో భారీగా నగదు పట్టుబడింది. ఈ పరిణామంతో ఎన్నికను రద్దు చేయాలని రాష్ట్రపతికి ఈసీ సిఫారసు చేసింది. సమ్మతించిన రామ్నాథ్ కోవింద్ ఎన్నికను రద్దు చేశారు.
మార్చి 30న ఆదాయ పన్ను శాఖ అధికారులు డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్ సన్నిహితుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆనంద్ తండ్రి ఇంట్లో రూ.10.50 లక్షల అనధికారిక నగదును పట్టుకున్నారు. రెండు రోజుల అనంతరం ఆయన మద్దతుదారులకు చెందిన సిమెంటు గోడౌన్లో రూ.11.53 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఏప్రిల్ 10న ఐటీశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా పోలీసులు డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్, మరో ఇద్దరు పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో ఎన్నికను రద్దు చేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని రాష్ట్రపతి అంగీకరించారు.
ఎన్నికల సంఘం తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18నే తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగాలి. కానీ.. వేలూరు స్థానానికి పోలింగ్ రద్దుతో 38 నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు.. 18 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఉపఎన్నికలు నిర్వహించనున్నారు.