జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చట్ట సవరణ బిల్లు-2019... లోక్సభలో ఆమోదం పొందింది. 278 మంది అనుకూలంగా ఓటేయగా.. ఆరుగురు మాత్రమే వ్యతిరేకించారు. బిల్లు ఆమోదంతో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోని భారతీయులపై ఉగ్రదాడుల దర్యాప్తునకు అనుమతి లభించినట్లయింది. సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపైనా దర్యాప్తు చేయడానికి ఈ సవరణలు అనుమతిస్తాయి.
బిల్లు ఆమోదానికి ముందు దిగువ సభలో సోమవారం పెద్ద చర్చే నడిచింది. కేంద్ర ప్రభుత్వం... దర్యాప్తు సంస్థలను రాజకీయ స్వలాభాల కోసం వినియోగిస్తుందని కొందరు ఎంపీలు ఆరోపించారు. ఇందుకు గట్టి సమాధానమిచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.
మోదీ సర్కార్.. ఎన్ఐఏ చట్టాన్ని దుర్వినియోగం చేయదని లోక్సభలో స్పష్టం చేశారు షా.