పునర్‌వ్యవస్ధీకరించిన కేంద్రీయ హోమియోపతి మండలి(సీసీహెచ్) పదవీకాలాన్ని ప్రస్తుతం ఉన్న ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలకు పొడిగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఈ మేరకు ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్ హోమియోపతి మండలి సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. హోమియోపతి, ఆయుర్వేదిక్ బోధనా విద్యాసంస్ధలకు పర్యవేక్షణ యంత్రాంగం అవసరం ఉందని పేర్కొన్న కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఆర్ఎస్పీ సభ్యుడు ప్రేమచంద్రన్ ఈ బిల్లుపై సవరణలను ప్రతిపాదించగా లోక్‌సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. హోమియోపతి మండలిని మరింత బలోపేతం చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు మంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు.
రాజ్యసభలో సెజ్ సవరణ బిల్లుకు ఆమోదం
ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)కు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం మార్చిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇక నుంచి ట్రస్టులు కూడా సెజ్‌ల్లో యూనిట్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు.