పార్కుల్లో జంటగా కనిపిస్తే ఖబర్దార్, ప్రేమించుకుంటే ఖబర్దార్ అని ఎంత యాగీ చేసినా... ప్రేమే గెలుస్తుంది. ప్రేమే నిలుస్తుంది. ఏదో ఒక శుభ ఘడియన అమ్మాయి వచ్చి ‘ఫలానా అబ్బాయిని నేను తెగ ఇష్టపడ్డాను, చాలా నచ్చేశాడు, వాడినే పెళ్లి చేసుకుంటా నాన్నా...’ అంటుంది- కాదూ కూడదంటే, నీ పర్మిషన్ అడగట్లేదు నాన్నా, నీకు ఇన్‌ఫర్మేషన్ ఇస్తున్నానంటుంది (ఇది అబ్బాయిల ఇంట్లోనూ వర్తిస్తుందని వేరే చెప్పాల్సిన పనిలేదు). కలికాలం మహిమ- పురాణాల్లో చెప్పిన అష్టవిధ వివాహాల్లోని (అప్పట్లో ఎనిమిది రకాల పెళ్లిళ్లు ఉండేవట. ఇప్పుడూ ఉన్నాయిగా... శాస్త్రోక్తం, గుళ్లో పెళ్ళి, దండలు మార్చుకునే పెళ్ళి, రిజిస్టర్ మ్యారేజ్... వంటివి) పిశాచ వివాహం(పైశాచికం) అతి నీచమయిందని, ప్రేమ వివాహం(గాంధర్వం) మహా ఉన్నతమైనదని ఉత్కృష్టమైనదని మహాభారతం సెలవిచ్చింది. మహాభారతంలో భగ్న ప్రేమలు, ప్రేమ వివాహాలు, మూగ ప్రేమలు ఉన్నాయి. మన పురాణేతిహాసాలు ప్రేమకే పెద్దపీట వేశాయి. ప్రేమకే జైకొట్టాయి...!
అంతెందుకు- రాజకీయాల వైపు ఓసారి చూడండి. ప్రపంచం ఎంత ప్రేమమయమై, రాగరంజితమై వన్నెలీనుతోందో తెలుస్తుంది. ‘ప్రేమయే తారకం, దైవతం వారికీ’ అన్నట్టుగా, ‘మనము రాగచిత్తులమై, మధురసాల మత్తులమై, రాధారాధన గదిలో వెలిగే అగరొత్తులమై, రాధామాధవు గళమున విరయు పూలగుత్తులమై...’ అని రాజధాని నడిబొడ్డున రాజకీయ పార్టీలు పాడుకుంటూ, కుదిరితే ఆడుకుంటూ, ప్రేమమయ జలధిలో ఈదుకుంటూ పరవశించి కొత్త, కొంగొత్త సొబగులీనుతున్నాయి. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అని యమునా నదిలో బోటు షికార్లు చేస్తున్నాయి. ‘కన్యక’లో గురజాడ సెలవిచ్చినట్లు- ‘కట్టవలెరా మరుని రాజ్యం, పట్టవలెరా గండపెండేరం రసిక మండలిలో’ అని రెచ్చిపోతున్నాయి.
నిన్నటికి నిన్న చూడరాదూ... ‘స్నేహితుడా, స్నేహితుడా, రహస్య స్నేహితుడా’ అంటూ తొలిచూపులోనే ప్రేమలో పడి కాంగ్రెస్ వెళ్లి కేజ్రీవాల్‌ను గాఢంగా(రహస్యంగా) ప్రేమించేసింది- ఓట్లను సీట్లను అర్పించింది- ‘లేదుగదా లవలేశము పేదరికమ్ము నాదు ప్రేమలో’ అని.
‘ఈ తతంగం ఎప్పటినుంచి నడుస్తోందని (కాసేపు తండ్రి పాత్ర పోషించి) భాజపా నిలదీసింది, కేజ్రీవాల్‌తో నీ ప్రేమేంటంది?
‘నువ్వేంటోయ్ అడిగేది’ అని కాంగ్రెస్ అనబోయింది కానీ, ‘ఈ ప్రేమా దోమా ఏంటి మన ఇంటా వంటా లేదు’ అని ఇంట్లోనే సెగ రాజుకొంది- అయినా ప్రేమ ప్రేమే. అస్సలు సిద్ధాంతం ఒంటపడని(చిర్రెత్తుకొచ్చే) శివసేననే ప్రగాఢంగా ప్రేమించేశాం... కేజ్రీవాల్‌తో ప్రేమలో దోషమేముంది... కాలొంకరా, కన్నొంకరా?
‘ఎక్కడైనా బావా అనొచ్చు కాని వంగతోటకాడ బావా అంటే ఎట్లా? బిహార్‌లో ఓకే, కానీ దిల్లీలో భాజపాని ప్రేమించటం ఎందుకు?’ అని అనుంగు మిత్రులు ఎంత వారించినా వినకుండా వెళ్లి నితీశ్ కుమార్ దిల్లీలో కూడా భాజపాతో చెట్టపట్టాలేసుకుని వీధులంటా తిరిగాడు. సినిమాలకు షికార్లకు డిన్నర్ పార్టీలకు వెళ్లాడు. ‘ప్రేమికులు ఎక్కువా, స్నేహితులా? ప్రేమికులే ఎక్కువ, స్నేహితులు పోతే పోతారు, వస్తే వస్తారు. ప్రేమికులు అంత సులభంగా దొరుకుతారా ఏంటి’ అని కర్రుచ్చుకుని సుద్దులు చెప్పిన మిత్రులిద్దరినీ నితీశ్‌జీ పొలిమేరలు దాటేదాకా తరిమేశాడు... ప్రేమంటే మాటలా!
‘నీవు రావు నిదుర రాదు, నిలిచిపోయె ఈ రేయీ...’ అని డొనాల్డ్ ట్రంప్ కోసం ఇక్కడ సారు ప్రేమతో ఎదురు చూస్తోంటే- అష్ట నాయికల్లో అభిసారికలా ‘ఎప్పుడెప్పుడే చూసేది, ఎప్పుడెప్పుడే కలిసేది’ అని అక్కడ ట్రంపుగారు తొందరపడుతున్నారట. కృష్ణశాస్త్రి గోపికలా విరహ పడుతున్నాడట. ప్రేమకు ఎల్లలుండవు, హెచ్చు తగ్గులుండవు, ధనిక పేద వ్యత్యాసం ఉండదు... ప్రేమకు కులమతాలు అంటవు. డొనాల్డ్ ట్రంపు కట్టే గోడలడ్డురావు. ప్రేమా, ప్యార్, మొహబ్బత్, ఇష్క్, లవ్... ఇలా ఏ పేరునైనా అది ప్రేమే. అన్నిచోట్లా, అన్ని భాషల్లోనూ సర్వే సర్వత్రా, సతతం భగవత్ స్వరూపంలా, శ్రీకృష్ణభగవానుడు గీతలో చెప్పినట్టు సర్వకాల సర్వావస్థలయందు, స్థల కాలాలకు అతీతంగా ప్రేమ నిండి ఉంటుంది. మొన్న ఇమ్రాన్ ఖాన్‌ను కూడా ట్రంప్ అలాగే ప్రేమించేశాడట!