తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణలకు పాల్పడుతున్న క్రమంలో భారీగా బలగాలను మోహరిస్తోంది భారత్. రానున్న శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడుపోనున్న క్రమంలో జవాన్ల పరిస్థితి, సైనిక సన్నాహాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంచుకొండల్లో ఎముకలు కొరికే చలిని సైతం తట్టుకునేలా చాలా సాంకేతికతలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు డీఆర్డీఓ ఛైర్మన్ జీ సతీష్ రెడ్డి. వాటన్నింటినీ సాయుధ దళాలు వినియోగిస్తున్నాయని తెలిపారు. శీతాకాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సైనికులు పోరాడేందుకు అవి ఉపయోగపడతాయని తెలిపారు.
ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన వెబినార్‌లో ఈ మేరకు డీఆర్డీఓ అభివృద్ధి చేసిన సాంకేతికతలపై వెల్లడించారు సతీష్ రెడ్డి.
"ఉత్తర పర్వతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి పడిపోయి విపరీతంగా మంచు కురుస్తుంది. అందుకు తగిన విధంగా చాలా సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేశాం. సైనికులకు అవసరమైన దుస్తులు, బూట్లు, వేడిని పుట్టించే వస్తువులు, ఆహారాన్ని వేడి చేసేందుకు వీలైన పరికరాల వంటివి అందులో ఉన్నాయి. అలాగే.. మంచుచరియలు విరిగిపడటాన్ని ముందుగానే గుర్తించే సాంకేతికత ఉంది. మంచుకొండల్లో సైనికులకు అవసరమయ్యే చాలా వస్తువులను దేశీయంగానే అభివృద్ధి చేశాం. ఇప్పుడు వాటిని సాయుధ దళాలు వినియోగిస్తున్నాయి."