సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి ఉద్దేశించిన సుప్రీంకోర్టు సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను 30 నుంచి 33కు పెంచే బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
సుప్రీంకోర్టు కార్యకలాపాలపై సభ్యులు ప్రశ్నించగా రవిశంకర్ ప్రసాద్ సమాధానాలిచ్చారు. న్యాయస్థానానికి సంబంధించిన విభేదాలు బయటికి రాకూడదన్నారు. విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని, అందులో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
సీజేఐతో కలిపి 34
ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన అనంతరం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపిన్యాయమూర్తుల సంఖ్య 34కు చేరనుంది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి సహా 31మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తోంది.
సూచించిన కొద్ది రోజులకే..
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి కోరిన కొద్దిరోజులకే బిల్లు తీసుకొచ్చారు. చివరిసారి 2009లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 25 నుంచి 30కి కేంద్రం పెంచింది. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నందున పరిష్కారంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 60వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇదీ చూడండి: 370 రద్దుపై శివసేన, ఆర్ఎస్ఎస్ హర్షం