దేశాన్ని ఓ వైపు కరోనా పట్టి పీడిస్తుంటే.. మరోవైపు మిడతల దాడి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో విరుచుకుపడిన ఈ దండుతో.. అధిక సంఖ్యలో పంట నష్టం వాటిల్లింది. అనేక జిల్లాలకు హై అలెర్ట్ ప్రకటించారు. త్వరలో మళ్లీ ఈ గుంపు భారత్‌వైపు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా వేసింది. ఈ క్రమంలోనే హరియాణాకు చెందిన ప్రముఖ ఎంటమాలజిస్ట్ యోగేశ్ కుమార్.. మిడతలతో పొంచి ఉన్న ముప్పును, వాటిని నియంత్రించేందుకు తమ రాష్ట్రంలో తీసుకున్న చర్యలను వివరించారు.
సాధారణంగా మిడతలు గుంపులుగా దాడి చేస్తాయని యోగేశ్ కుమార్ తెలిపారు. 10వేల మిడతలు పంటపై పడినప్పుడు రైతుకు వాటిని కట్టడి చేయడం ఆసాధ్యమని.. కాబట్టి నివారణ పద్దతులను పాటించాలని సూచించారు.
ఒక రోజులో సుమారు 2,500 మందికి సరిపడే ఆహారాన్ని మిడతల దండు తినేస్తుందని.. అవి దాడి చేసే ముందే పంటకు క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడం మంచిదని వివరించారు యోగేశ్. ఇందుకోసం క్లోరోపిరిఫోస్, 20 సీఏబీ, 50 సీఏబీ, లామ్డా సైలోథ్రిన్, డెల్టామాత్రిన్ వంటి పురుగుల మందులను వాడాలని సూచించారు.
మిడతలు ప్రధానంగా ఎడారి ప్రాంతంలో సంతానోత్పత్తి చేస్తాయి. భారత్‌లో రాజస్థాన్, గుజరాత్‌లోని భుజ్ ప్రాంతాలు ఇందుకు అనువుగా ఉన్న ప్రదేశాలు. మిడతలపై వాతావరణం ఎటువంటి ప్రభావం చూపదు. అవి తేమగా ఉన్న ఇసుక నేలల్లో గుడ్లు పెడతాయి. 3 నెలల్లో మూడు దఫాలు 80 నుంచి 90 గుడ్లు పెట్టే అవకాశం ఉంది.
-యోగేశ్ కుమార్, ఎంటమాలజిస్ట్