తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జూన్​ 15 వరకు లాక్​డౌన్.. కొత్త నిబంధనలు ఇవే! - లాక్​డౌన్ కొత్త నిబంధనలు

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోమారు లాక్​డౌన్​ పొడిగించేందుకు సిద్ధమవుతుంది. కనీసం జూన్ 15 వరకు లాక్​డౌన్ పొడిగించే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు... ఈ సారి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Lockdown likely to be extended till June 15
జూన్​ 15 వరకు లాక్​డౌన్.. కొత్త నిబంధనలు ఇవే?

By

Published : May 30, 2020, 5:49 AM IST

Updated : May 30, 2020, 6:32 AM IST

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మరోమారు లాక్​డౌన్​ పొడిగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి. కనీసం జూన్​ 15 వరకు లాక్​డౌన్ పొడిగించేందుకు కేంద్రం సిద్ధపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రాష్ట్రాల మాటే ఫైనల్​

మరోమారు లాక్​డౌన్​ పొడిగిస్తే... నిబంధనలను మరింత కఠినతరం చేయాలా లేక సడలించాలా అనే నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రాలకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ కేంద్రం సమన్వయం చేయనుంది.

విద్యా సంస్థలు, మెట్రో సేవల పున:ప్రారంభంపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకునేలా కేంద్రం వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక ప్రాంతాలైన ఆలయాలు, మసీదులు, చర్చిల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం కానుంది.

రద్దు అనివార్యం!

వైరస్​ అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న వాటిపై నిషేధం కొనసాగనుందని సమాచారం. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సేవలు, రాజకీయ సమావేశాలు, మాల్స్, థియేటర్లపై నిషేధం కొనసాగే అవకాశం ఉంది.

అలాగే 80 శాతం కరోనా కేసులు నమోదైన 30 మున్సిపాలిటీల్లో మాత్రం కఠిన ఆంక్షలు విధించక తప్పదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలిపింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్​, మధ్యప్రదేశ్​,బంగాల్​, రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, పంజాబ్​, ఒడిశాలో ఈ 30 మున్సిపాలిటీలు ఉన్నాయి.

ఇవి పాటించాల్సిందే..

కరోనా మరింతగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మాస్క్​ ధరించటం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.

రంగాల వారీగా మార్గదర్శకాలు

అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జ్ఞాని... 'ఈటీవీ భారత్​'తో మాట్లాడారు. లాక్​డౌన్ పొడిగించినట్లయితే, రంగాల వారీగా నిర్దిష్ట మార్గదర్శకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్​డౌన్ దీర్ఘకాలిక పరిష్కారం కాదని, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని గిరిధర్ జ్ఞాని అన్నారు.

అందరినీ సంప్రదించిన తరువాతే..

వివిధ నగరాల్లో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాపిస్తుండడానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే లాక్​డౌన్​కు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే ముందు.... వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులు, మునిసిపల్ కమిషనర్లతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్​ గౌబా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ మాట్లాడినట్లు సమాచారం.

మోదీతో అమిత్ షా భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నిన్న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. లాక్​డౌన్ అంశంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను, సలహాలను ప్రధానికి వివరించారు. మరో రెండు రోజుల్లో లాక్​డౌన్​ పొడిగింపుపై కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:'ఇండియా' పేరు మార్పుపై జూన్​ 2న సుప్రీం విచారణ

Last Updated : May 30, 2020, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details