ఒకవైపు కళ్ల ఎదుటే విధ్వంసాలు, అగ్నికి ఆహుతవుతున్న ఆస్తులు..మరోవైపు దాడులు. ఎవరు ఎటు నుంచి వచ్చి కాల్పులు జరుపుతున్నారో తెలియని పరిస్థితిలో దిల్లీ వాసులు అనేక మంది ప్రాణాలు అరచేత పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ప్రత్యేకించి ఘర్షణలు ఉద్ధృతంగా జరిగిన ఈశాన్య దిల్లీలో అనేక కుటుంబాలకు గత మూడు రోజులూ క్షణమొక యుగంలానే గడిచింది. రక్షణ కోసం పోలీసులకు ఫోన్ చేసినా స్పందన లేదు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే అంబులెన్సులు అందుబాటులో లేక తల్లడిల్లిపోయారు.
నాన్నను రక్షించుకోలేకపోయా..
గోండా ప్రాంతంలో ఓ యాభై ఏళ్ల వ్యక్తి తన ఇంటి వద్ద ఆందోళనలు చేస్తున్న ఇరువర్గాల వారినీ సముదాయించేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతనిపై కాల్పులు జరిపాడు..బుల్లెట్ శరీరంలోకి దూసుకుపోవడం వల్ల కుప్పకూలిపోయాడు.. పక్కనే ఉన్న ఆ వ్యక్తి కుమారుడు తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. 'పోలీసుల కోసమని 100కు ఫోన్ చేశాను..ఎవరూ స్పందించలేదు. వెంటనే అంబులెన్స్ కోసం ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. సుమారు 5 కి.మి దూరంలో ఉన్న ఆసుపత్రికి ఓ మిత్రుడి ద్విచక్రవాహనంపై రక్తంతో తడిసి ముద్దైన మా నాన్నను తీసుకువెళ్లాల్సి వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది'అని ఓ యువకుడు కన్నీరు పెట్టుకున్నాడు.