కేరళలో ఆరేళ్ల చిన్నారి టీచర్ ఆన్లైన్ క్లాసులు వింటూ నవ్వులు పూయిస్తున్నారు నెటిజన్లు. ఆమె పాఠాలు బోధిస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే, వీడియో కోసం తానేదో యాక్టింగ్ చేసిందనుకునేరు. కానే కదు. ఒకటో తరగతి చదివిన ఆ బుజ్జాయి ఎల్కేజీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు వినిపిస్తూ ఎందరో టీచర్లు, తల్లిదండ్రుల మన్ననలు పొందుతోంది.
ఆరేళ్ల టీచర్ ఆన్లైన్ పాఠాలు సూపర్ అమ్మకు సాయంగా..
మళప్పురం జిల్లాకు చెందిన నుస్రత్, తాహీర్ దంపతుల కుమార్తె దియా ఫాతిమా. దియా తల్లి ప్రాథమిక పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు. అదే బడిలో దియా ఒకటో తరగతి చదువుతోంది. లాక్డౌన్ వేళ ఇంట్లో నుంచే ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్న తల్లికి ఓ రోజు ఒంట్లో బాలేదు. దీంతో, దియా తల్లికి సాయపడాలని నిర్ణయించుకుంది. అమ్మను విశ్రాంతి తీసుకోమని చెప్పి, అమ్మలా ఓ చీర కట్టుకుని ఎల్కేజీ విద్యార్థులకు పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది.
అసలైన టీచర్లే ఆశ్చర్యపోయేలా.. టమోట, చిక్కుడుకాయలతో విద్యార్థులకు లెక్కలు నేర్పింది దియా. ఎంతో అనుభవం ఉన్న టీచర్లాగా చిటికెలో పిల్లలకు లెక్కలు చెప్పిన ఆ బుల్లి టీచర్ బోధనా శైలి విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులకూ తెగ నచ్చేసింది. ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టమని, పెద్దయ్యాక టీచర్ అవ్వాలన్నదే తన కల అంటూ ఇప్పటి నుంచే తన ప్రతిభకు సానపడుతోందీ దియా టీచర్.
ఇదీ చదవండి: 'బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా పరార్'