తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైద్య ఖర్చులకు చికిత్స చేద్దాం..! - Let’s treat medical expenses

మనిషికి జబ్బు రాకూడదు. ఒకవేళ వచ్చిందా.. జబ్బు కంటే కూడా దానికయ్యే చికిత్స ఖర్చే ఎక్కువగా కుంగదీస్తోంది. ఆసుపత్రులకు వెళ్లాలంటేనే గుండె లబ్‌డబ్‌లు లయ తప్పుతున్నాయి. వైద్య ఖర్చుల్ని భరించలేక కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఏటేటా పెరిగిపోతున్న మందుల ధరలు, డాక్టర్‌ ఫీజులు, రోగ నిర్ధారణ పరీక్షలు, ఆసుపత్రి ఖర్చులతో మధ్యతరగతి జీవనం అతలాకుతలమవుతోంది. రాబోయే దశాబ్దకాలంలో ప్రపంచానికి మరీ ముఖ్యంగా భారత్‌లాంటి వర్ధమాన దేశాలకు వైద్య ఖర్చులు పెను సవాలు విసరబోతున్నాయి. దీనికి పరిష్కారాలేమిటి? ఈ విపరిణామాన్ని ఎలా ఎదుర్కొంటాం? జబ్బుల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

medical
వైద్య ఖర్చులకు చికిత్స చేద్దాం

By

Published : Dec 23, 2019, 2:45 PM IST

అసలు జబ్బు కంటే కూడా.. దాని చికిత్సకు అయ్యే వైద్య ఖర్చు మాట వింటేనే రోగులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం వైద్య ఖర్చుల కారణంగానే మన దేశంలో ఏటా కొత్తగా 7% కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. వచ్చే దశాబ్దంలో వైద్య ఖర్చులు సగటున ఏటా 5.5% పెరుగుతాయని అంచనా!

హాయిగా తిని తిరుగుతున్నంత కాలం అంతా బాగానే ఉంటుందిగానీ ఏదైనా కారణాన రోగాల పాలయ్యామంటే మాత్రం.. అష్టకష్టాలూ ఆరంభమైనట్లే. వైద్యుల ఫీజు, వాళ్లు రాసే రకరకాల పరీక్షల ఖర్చులు, ఆ పైన జేబులు ఖాళీ చేయించే మందుల ధరలు.. అన్నీ కలిసి మనిషి కోలుకునే సరికి కుటుంబం పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. చిన్నాచితకా జబ్బుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక గుండెపోటు, క్యాన్సర్‌ వంటి తీవ్ర వ్యాధుల బారిన పడితే కుటుంబాలు పూర్తి ఊబిలో దిగినట్లే! రోగుల్లో 20% మంది చికిత్సల కోసం తమకున్న అరకొర ఆస్తులూ అమ్ముకుంటున్నారు. కొత్త దశాబ్దంలో ఈ పరిస్థితి మరింత ముదిరి.. ఇదో పెను విపత్తు కాబోతోంది. దీన్ని నెగ్గుకొచ్చేది ఎలాగన్నదే మన ముందున్న పెద్ద సవాల్‌!

  • ముప్పేటా.. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు, క్యాన్సర్ల వంటి తీవ్ర సమస్యలు పెరుగుతున్నాయి.
  • అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నా వాటికయ్యే వ్యయం ఎక్కువగా ఉంటోంది.
  • ఔషధాల ధరలు, పరీక్షల ఖర్చులు ఏటేటా పెరిగిపోతున్నాయి. వైద్య ఖర్చుల్లో 52% ఔషధాలకే పోతోంది.
  • నిత్యం ఔషధాలు వాడాల్సిన పరిస్థితిలో వృద్ధుల వైద్యఖర్చులూ పెరుగుతున్నాయి.

కొంతకాలం బ్రిటన్లో పనిచేసి తిరిగొచ్చిన ఓ భారతీయ వైద్యుడిని- వైద్య సేవల విషయంలో మనకూ, బ్రిటన్‌కూ తేడా ఏం గమనించారని అడిగినప్పుడు... ‘‘బ్రిటన్లో రోగి వచ్చి డాక్టర్‌ ముందు కూర్చుంటే.. రోగం ఏమిటి? నిర్ధారణ కోసం పరీక్షలేం చెయ్యాలి? ఎంత శక్తిమంతమైన మందులివ్వాలి? ఇంకా మెరుగైన వైద్యం చెయ్యొచ్చా? ఇలా ఆలోచిస్తాం. అదే మన దేశంలో.. రోగి కుటుంబ పరిస్థితి ఏమిటి? మందులు రాస్తే కొనే స్థోమత ఉందా? బీమా ఉందా..? పోనీ ప్రభుత్వ స్కీములన్నా వర్తిస్తాయా? ఇలా ఆలోచించాల్సి వస్తుంది, ఇదే పెద్ద తేడా’’ అని వివరించారు. ఈ అనుభవం చాలు.. మన దేశంలో వైద్యాన్ని ఆర్థిక అంశాలు ఎంతగా శాసిస్తున్నాయో అర్థం చేసుకునేందుకు! దేశంలో 70% రోగులు ప్రైవేటు వైద్యాన్నే ఆశ్రయించాల్సి వస్తోంది. అందులో అత్యధిక మందికి ఎలాంటి వైద్య బీమా ఉండటం లేదు. దీంతో ‘డెంగీ’లాంటి జ్వరాల బారినపడినా కూడా.. ఆసుపత్రి ఖర్చులు భరించలేక కుటుంబాలు కుదేలవుతున్నాయి.

మనమేం చెయ్యొచ్చు?

సంపన్నులకు వైద్య ఖర్చులు మరీ పెద్ద సమస్యేం కాదు. బీదల కోసం మన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలు తెచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. దీన్లో ఎన్ని పరిమితులున్నా, పేదలు, ప్రభుత్వోద్యోగులకు కొంత భరోసా ఉంటోంది. ఎటొచ్చీ.. అసంఘటిత రంగం, మధ్యతరగతి పరిస్థితే దయనీయం. ఈ నేపథ్యంలో వచ్చే దశాబ్దంలో పెరిగే వైద్య ఖర్చులను తట్టుకునేందుకు మనమేం చెయ్యాలన్నది కీలకం.

ఆరోగ్య చైతన్యం

ఆరోగ్య పరిరక్షణపై ఎంతగా అవగాహన పెరిగితే వ్యాధుల బెడద అంత తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవటమెలాగన్న దానిపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. పోషకాహారం, నిత్య వ్యాయామం, పరిశుభ్రత, ప్రబలంగా ఉన్న వ్యాధుల విషయంలో నివారణ చర్యలు పాటించటం.. ఇవన్నీ కీలకం. ఈ అవగాహన బాల్యం నుంచే పెంచాలి.

ముందస్తు వైద్య పరీక్షలు

వ్యాధి ముదిరి బయటపడ్డాక ఆసుపత్రుల చుట్టూ తిరిగే కంటే ఏడాదికోమారు కొన్ని వైద్య పరీక్షల ద్వారా ముప్పును ముందే పసిగట్టటం వల్ల లాభం ఎన్నోరెట్లు ఎక్కువ. ఈ ముందస్తు పరీక్షలతో క్యాన్సర్‌ సహా ఎన్నో తీవ్ర వ్యాధులను పసిగట్టొచ్చు. ఇప్పటి వరకూ అధికాదాయ, విద్యావంతుల కుటుంబాలకే పరిమితమవుతున్న ముందస్తు పరీక్షలు.. ప్రతి పేద కుటుంబానికీ చేరువ కావాలి.

వైద్య బీమా

అనూహ్యంగా పెరుగుతున్న వైద్య ఖర్చులకు ‘వైద్య బీమా’ ఒక్కటే ముఖ్యమైన తరుణోపాయం. ప్రస్తుతం దేశంలో మొత్తం ఉన్న వైద్య బీమా పాలసీలు: 2.07 కోట్లు; లబ్ధిదారుల సంఖ్య: 47.20 కోట్లు. దీనిలో పేదలు, ఉద్యోగుల కోసం ప్రభుత్వాలు, కంపెనీలు తీసుకుంటున్నవే అధికం. మిగతా 80 కోట్ల మందికిపైగా వైద్యబీమా సౌకర్యం లేనివారే. చాలామంది 2-3 ఏళ్లు వైద్య బీమా కట్టి, ఆ తర్వాత దాన్నో దండగగా భావిస్తూ మానేస్తున్నారు. కానీ వ్యాధుల చికిత్సలకు అయ్యే ఖర్చులతో పోలిస్తే బీమా ప్రీమియం ఎప్పుడూ తక్కువగానే ఉంటుందని గుర్తించాలి.

ఇదీ మన స్థితి!

(వివిధ సర్వేల ఆధారంగా)

2000-2014 మధ్య వైద్య ఖర్చుల్లో పెరుగుదల 370%

ఇక వచ్చే దశాబ్దిలో ఎన్ని వందల రెట్లు పెరుగుతుందో ఊహించలేం.

వివిధ దేశాల్లో మొత్తం వైద్య వ్యయాల్లో ప్రభుత్వాల వాటా

బ్రిటన్‌ 83%, చైనా 56%, అమెరికా 48%, బ్రెజిల్‌ 46%, ఇండోనేసియా 39%. భారత్‌ 30%.
(మిగిలినదంతా ప్రజలు తమ జేబుల్లో నుంచే పెట్టుకోవాల్సి వస్తోంది)

వైద్య ఖర్చును సొంతంగా భరిస్తున్న ప్రజల శాతం

అమెరికాలో 13.4%, బ్రిటన్‌లో 10%, చైనాలో 13.4%. మన దేశంలో 62%. వైద్య బీమా లేకపోవడం, ఉన్నా అన్ని రోగాలకూ వర్తించకపోవడం ఇందుకు కారణం.

దేశంలో ఒక్కో వ్యక్తికి వైద్యం కోసం గత ఏడాది సగటున ప్రభుత్వం వెచ్చించింది

రూ. 1657

ప్రైవేటు వైద్యం పొందుతున్న వారిలో సరాసరిన ఒక్కొక్కరికి గత ఏడాది అయిన వ్యయం

రూ. 31,845

ఇదీ చూడండి : ముస్లిం మైనారిటీలకు భారత్​ రక్షణ కల్పించాలి: ఓఐసీ

ABOUT THE AUTHOR

...view details