తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యుద్ధానికి సిద్ధం కండి.. కరోనాను దిగ్బంధిద్దాం! - కరోనాను ఇలా నియంత్రిద్దాం

కరోనా దెబ్బకు మరణాలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్​ను లాక్​డౌన్​ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ డబ్బు కంటే మానవజాతి సంక్షేమమే ముఖ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Let's control the corona!
కరోనాను దిగ్బంధిద్దాం!

By

Published : Mar 26, 2020, 8:23 AM IST

ప్రచ్ఛన్న సునామీలా యావత్‌ ప్రపంచాన్నీ చుట్టబెడుతున్న కొవిడ్‌ మహమ్మారి అమెరికాను సైతం వణికిస్తున్నా, వైద్యులు సూచించినట్లు పూర్తిస్థాయి మూసివేత (లాక్‌డౌన్‌)కు తాను సిద్ధంగా లేనని దేశాధ్యక్షుడు ట్రంప్‌ భీష్మిస్తున్నారు. ఆర్థిక నష్టాల తీవ్రతను తట్టుకోవడం కష్టమంటూ అగ్రరాజ్య నేత స్పష్టీకరిస్తున్నా- దేశ ప్రజల ప్రాణాలే విలువైనవంటూ భారత ప్రధాని మోదీ మూడు వారాలపాటు దేశవ్యాప్త దిగ్బంధాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య తొలి లక్షకు చేరడానికి 67 రోజులు, వాటికి మరో లక్ష జత కలవడానికి 11 రోజులు పట్టగా, పట్టుమని నాలుగు రోజుల్లోనే ఇంకో లక్ష కేసుల నమోదు- ఆ మహమ్మారి దూకుడు ఎంత భయానకంగా ఉందో వెల్లడిస్తోంది. ఇండియాలో తొలి యాభై కరోనా కేసులు వెలుగు చూడటానికి 40 రోజులు, వాటికి మరో యాభై జతపడటానికి ఇంకో అయిదు రోజులు పట్టగా, పిమ్మట అయిదు రోజుల్లోనే మరో వంద కేసులు నమోదయ్యాయి. అయిదు రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇండియాలో కరోనా కేసులు రెట్టింపు అవుతున్న తీరు- మహాముప్పునకు ముందస్తు సూచిక అవుతున్న వేళ కేంద్రం ప్రకటించిన 21 రోజుల దిగ్బంధం, కరోనా వైరస్‌ గొలుసును తెంచేందుకు చేపట్టిన పటిష్ఠ వ్యూహం. కరోనా ఎవరికి సోకినా పద్నాలుగు రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కుటుంబంలో ఎవరికి కొవిడ్‌ వచ్చినా ఆ వ్యాధి అంతవరకే పరిమితమైపోతుంది కాబట్టి- రోగుల్ని కచ్చితంగా గుర్తించి చికిత్స అందించడం సాధ్యపడుతుంది. అదే సమయంలో సమాజంలో తక్కినవాళ్లు దాని బారిన పడకుండా నిలువరించినట్లు అవుతుంది. గతంలో ప్రపంచాన్ని బెంబేలెత్తించిన మశూచి, పోలియోల్ని ఇండియా సమర్థంగా తుడిచిపెట్టగలిగిందన్న డబ్ల్యూహెచ్‌ఓ- కొవిడ్‌ మహమ్మారిపై సమరంలోనూ ఇండియా మార్గనిర్దేశం చెయ్యాలని కోరుతోంది. కాలంతో పోటీపడుతూ మహమ్మారిపై పోరుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరచిస్తున్న వ్యూహాలకు బాధ్యత గల పౌరులుగా నిబద్ధత చాటుతూ జనం గెలవాలి; ఇండియాను గెలిపించాలి!

డబ్బా? ప్రాణాలా?

కొవిడ్‌ను కట్టడి చెయ్యడమే లక్ష్యంగా కేంద్రం అమలు చేస్తున్న దిగ్బంధం వల్ల జరిగే ఆర్థిక నష్టం దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలని అంటున్నారు. డబ్బుకంటే మనుషుల ప్రాణాల్నే విలువైనవిగా భావించే దేశంలో- దిగ్బంధం ఎంత అవసరమో నిర్ధారిస్తున్నాయి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్‌) గణాంకాలు! ఈ నెల 15న కేవలం వందగా నమోదైన కరోనా కేసులు అయిదు రెట్లు కావడానికి తొమ్మిది రోజులే పట్టిందన్న ఐసీఎమ్‌ఆర్‌- ఇంటి సభ్యులెవరూ బయటకు రాకుండా దిగ్బంధిస్తేనే కరోనా కేసుల ఉద్ధృతిని 69 శాతం తగ్గించడం సాధ్యపడుతుందని, ఒక్కసారిగా వేల కేసులు వచ్చిపడి వైద్య ఆరోగ్య రంగం కుదేలైపోయే దురవస్థను నివారించగలుగుతామని గట్టిగా సూచించింది. కరోనా వైరస్‌ సోకి రోగ లక్షణాలు బయటపడనివారిలో కనీసం 75 శాతాన్ని గుర్తించగలిగినా- వెంటనే అది అంటువ్యాధిగా జడలు విరబోసుకోకుండా ఆపగలుగుతామనీ ప్రకటించింది. కొవిడ్‌ను ఏ ఒక్కరూ ఏ మాత్రమూ అలక్ష్యం చెయ్యకూడదని దక్షిణ కొరియా, అమెరికా అనుభవాలే చాటుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో అనుమానితులందర్నీ జల్లెడ పట్టి, రోగ నిర్ధారణ పరీక్షలతో వడకట్టి కొవిడ్‌ అంటువ్యాధిగా మారకుండా జాగ్రత్తగా కాచుకొంటూ వచ్చిన దక్షిణ కొరియాలో 31వ నెంబరు రోగి ప్రార్థనాలయాలు ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా తిరిగి వ్యాధి విజృంభణకు ప్రధాన కారణమైంది. ఆ తరహా రోగ సంక్రమణాన్ని నిలువరించడానికే దేశ దిగ్బంధం నేటి అవసరంగా మారింది. శాస్త్ర సాంకేతిక మేరునగంగా వాసికెక్కిన అమెరికా సైతం 55వేలు దాటిన కరోనా కేసులతో బెంబేలెత్తుతూ దక్షిణ కొరియా తోడ్పాటును అర్థిస్తోంది. అలా చేతులు కాలాక ఆకుల కోసం వెంపర్లాడే దుస్థితి రాకూడదంటే కరోనా వైరస్‌ కట్టడి వ్యూహంలో- ప్రతి పౌరుడూ నిబద్ధ సైనికుడవ్వాలి!

హెచ్చరికలు బేఖాతరు చేయవద్దు

అంతర్జాతీయంగా కరోనా కల్లోలాన్ని విశ్లేషించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌కు సంబంధించి చేస్తున్న హెచ్చరికలు ఏ మాత్రం తోసిపుచ్చలేనివి. ముంచుకొచ్చిన ముప్పు తీవ్రతను సాధ్యమైనంతగా తగ్గించడానికి ప్రభుత్వాలు విధించిన దిగ్బంధం- జనాభాలో 30 శాతంగా ఉన్న నిరుపేద వర్గాల నిత్య జీవనాన్ని దుర్భర దుఃఖభాజనంగా మార్చేయకుండా సర్కార్లు సకల జాగ్రత్తలూ తీసుకోవాలి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.37గా ఉన్న బియ్యాన్ని మూడు రూపాయలకే 80 కోట్ల జనావళికి అందిస్తామని కేంద్రం ప్రకటించింది. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా 130 కోట్లకు పైగా జనం గృహనిర్బంధంలో ఉన్న పరిస్థితుల్లో- పోషకాహార లోపాలే పెనుశాపాలై జనం ఈసురోమంటున్న దేశంలో నిత్యావసరాలు సక్రమంగా లబ్ధిదారుల ఇళ్లకు చేరేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి. బడిపిల్లల మధ్యాహ్న భోజనాన్ని వారి వారి ఇళ్లకే పంపించేందుకు కేరళ సిద్ధమైంది. జన సంచారానికి వీల్లేకుండా ఎక్కడికక్కడ రవాణా సేవల్ని నిలిపేసిన నేపథ్యంలో గోదాముల నుంచి మారుమూల పల్లెల దాకా నిత్యావసరాల సరఫరా గొలుసు ఎక్కడా దెబ్బతినకుండా కాచుకోవాలి. మొన్న 23-24 తేదీల్లో ఈ కామర్స్‌ వేదికల నుంచి 79శాతం, రిటైల్‌ దుకాణాల నుంచి 32శాతం నిత్యావసరాల్ని వినియోగదారులు కొనుగోలు చెయ్యలేకపోయారని, మందుల పరిశ్రమా ఉత్పత్తి సరఫరా ఇబ్బందులను ఎదుర్కొంటోందని వార్తాకథనాలు చాటుతున్నాయి. వాటన్నింటినీ సత్వరం పరిష్కరించి ఇంటి పట్టున జనం స్వచ్ఛందంగా తిండికి తిప్పల్లేకుండా ఉండేందుకు ప్రభుత్వాలే చొరవ చూపాలి. ప్రపంచవ్యాప్తంగా మురికివాడల జనాభాలో మూడోవంతు ఇండియాలోనే ఉన్న వాస్తవాన్ని గుర్తించి- ఏడు లక్షల జనాభాగల ధారావి లాంటిచోట్ల సామాజిక దూరం పాటించడంలోని సాధకబాధకాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. కరోనా కారణంగా వచ్చిన సమస్యలతో ప్రభుత్వాలు యుద్ధం చేస్తూ కొవిడ్‌పై సమరానికి ప్రజల్ని సిద్ధం చెయ్యాలి!

ఇదీ చూడండి:జాతీయ రహదారులపై టోల్​ వసూళ్లు రద్దు

ABOUT THE AUTHOR

...view details