తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కంచుకోట​లో కమ్యూనిస్టుల అస్తిత్వ పోరాటం

బంగాల్​లో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్​)ది సుదీర్ఘ చరిత్ర. 34ఏళ్లపాటు అప్రతిహత పాలన. 1980లో రాష్ట్రంలోని 42లోక్​సభ స్థానాలకు అత్యధికంగా 38స్థానాలు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. 2011 తర్వాత పార్టీలో నాయకత్వలేమి తీవ్ర ప్రభావం చూపింది. ఉన్న రెండు సిట్టింగ్ సీట్లనైనా కాపాడుకోగలమా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు కమ్యూనిస్టులు.

34ఏళ్ల పాటు సుదీర్ఘంగా బంగాల్​ను పాలించిన ఘనత సీపీఎం సొంతం.

By

Published : Mar 23, 2019, 1:22 PM IST

Updated : Mar 23, 2019, 6:53 PM IST

34ఏళ్ల పాటు సుదీర్ఘంగా బంగాల్​ను పాలించిన ఘనత సీపీఎం సొంతం.
దేశ రాజకీయ చరిత్రలో బంగాల్​ కమ్యూనిస్టుల చరిత్ర ఓ మైలురాయి. 34ఏళ్ల పాటు సుదీర్ఘంగా బంగాల్​ను పాలించిన ఘనత సీపీఎం సొంతం. కానీ నేడక్కడ కమ్యూనిస్టుల ఉనికే ప్రశ్నార్థకమైన పరిస్థితి. కంచుకోటలో ఎర్రపార్టీ పరాజయాల పర్వానికి కారణాలేంటి? గ్రామీణులు​, మైనార్టీలు, వామపక్ష పార్టీని వదిలి వెళ్లటానికి నేపథ్యమేంటి.?

పశ్చిమ బంగలో కమ్యూనిస్టులది ఘనమైన చరిత్ర. 1996,2004 సంవత్సరాల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయాత్మక హోదా సీపీఎం పార్టీది. 1977 మొదలు 2011 వరకు 34 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నిర్విరామంగా పాలించింది. రోజులు మారాయి. ప్రస్తుతం ఉనికే ప్రశ్నార్థకంగా మారిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లిష్టతరంగా మారిన పరిస్థితుల్లో ఈసారి లోక్​సభ ఎన్నికల్లో బలం నిరూపించుకునేందుకు సీపీఎం సిద్ధమవుతోంది.

పతనానికి కారణాలెన్నో:

2011 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఓడించి అధికారాన్ని చేపట్టింది మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్. అప్పటి నుంచి బంగాల్​లో ఎర్ర జెండా పార్టీలు క్షీణిస్తూ రావడానికి కారణాలెన్నో. 2011 నుంచి రాష్ట్రంలో ఓటు బ్యాంకు తగ్గుతూ వచ్చింది. నేతలు టీఎంసీ, భాజపా కండువాలు కప్పుకోవడం, పర్యవసానంగా పార్టీలో నాయకత్వలేమి నెలకొంది. భాజపా అనూహ్యంగా పుంజుకోవటం మూలంగా ప్రధాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయింది సీపీఎం.

"బంగాల్​లో మాకు ఈ ఎన్నికలు అత్యంత క్లిష్టమైనవి. రాష్ట్ర రాజకీయాలలో మాకు ఈ స్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. రానున్న రోజుల్లో పరిస్థితులు అనుకూలిస్తాయని భావిస్తున్నాం. తృణమూల్ కాంగ్రెస్​కు గట్టి పోటీ ఇచ్చేది భాజపా కాదు సీపీఎం అని ప్రజలు గుర్తించే రోజు వస్తుంది."

-హన్నన్ మొల్లా, సీపీఎం పొలిట్​ బ్యూరో సభ్యులు

కాంగ్రెస్​తో పొత్తు కుదరలేదు...

42 లోక్​సభ స్థానాలున్న పశ్చిమ బంగాలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం సాధించింది రెండు సీట్లు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్​తో పొత్తుకు సిద్ధం అయినప్పటికీ చర్చలు కొలిక్కిరాలేదు. చివరకు రెండు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించాయి. ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్తే మిగిలిన రెండు సీట్లను కాపాడుకోవడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అప్పటి నేతల ధైర్యసాహసాలు వీరికి లేవు...

1977 నుంచి 2000 వరకు పశ్చిమ బంగా ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు, తర్వాత ముఖ్యమంత్రి బుద్ధదేవ్​ భట్టాచార్యకు ఉన్నన్ని ధైర్యసాహసాలు, ధీరత్వం ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకుల్లో లోపించాయి. పార్టీ అంతర్గత నివేదిక ప్రకారం, 77వేల పోలింగ్​ స్టేషన్లలో కనీసం 30శాతం స్టేషన్లలో పోలింగ్​ ఏజెంట్లే కరవయ్యారు. అంటే ఆ ప్రాంతాల్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

"మూడు దశాబ్దాలకు పైగా మా పార్టీ అధికారంలో ఉండటమే ఈ క్షీణతకు కారణం అయి ఉంటుంది. ఆ సమయంలో ఒకసారి ఓటమి చెంది మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉండేది."

-హన్నన్ మొల్లా

స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్రంలో పార్టీ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తూ వచ్చింది.2004 ఎన్నికల్లోనూ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మకంగా వ్యవహరించింది. అయితే మైనార్టీల స్థితిగతులపై 2008లో సచార్​ కమిటీ నివేదిక విడుదలైన అనంతరం రాష్ట్రంలో లెఫ్ట్​ పతనం ప్రారంభమైంది. బుద్ధదేవ్​ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నందిగ్రామ్​, సింగూరులో భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు మమతా బెనర్జీ. అక్కడి నుంచి గ్రామీణులు, మైనార్టీలు సహా బంగాల్​ మొత్తం దీదీ వెంట నడిచింది.

Last Updated : Mar 23, 2019, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details