జమ్ముకశ్మీర్ పోలీస్ అధికారి దవీందర్ సింగ్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి సమాధానమివ్వాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా ఈ విషయంలో పారదర్శక విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు సుర్జేవాలా.
"దీని వెనుక భారీ కుట్ర ఉంది. మీరు చెప్పిన ప్రకారం, ఎవరి ప్రోద్బలంతో దవీందర్ సింగ్ ఉగ్రవాదులను దిల్లీకి తీసుకొచ్చాడు. అధికారంలో ఉన్న నాయకులతో అతనికి సంబంధాలు ఉన్నాయా? ఇందులో అతనే ముఖ్యమైన వ్యక్తా? లేదా కుట్రలో భాగంగా అతనిని వాడుకున్నారా?
ఎంతకాలంగా ఉగ్రవాదులతో అతని సాన్నిహిత్యం కొనసాగుతోంది? 2001లో పార్లమెంటుపై దాడిలో అతని పాత్ర ఎంత? అతను డీఎస్పీగా ఉన్న చోటే పుల్వామా దాడి జరిగింది. ఈ దాడితో అతనికేంటి సంబంధం?"
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి