భారత బాహుబలి ప్రాజెక్ట్ చంద్రయాన్-2కు సంబంధించి ఓ శుభవార్త తెలిసింది. చంద్రుని ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలిసినట్లు ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తెలిపారు. అయితే తాము ప్రయత్నించినట్టు ల్యాండర్... జాబిల్లిపై మృదువుగా దిగి ఉండకపోవచ్చన్నారు.
"చంద్రుని ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనుక్కోగలిగాం. ల్యాండర్ థర్మల్ చిత్రాన్ని ఆర్బిటర్ తీసింది. అయితే ప్రస్తుతం ల్యాండర్‌తో సంబంధాలు లేవు. సమాచార వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాము. త్వరలోనే ఇది పూర్తవుతుంది." - కె. శివన్, ఇస్రో ఛైర్మన్
రోవర్ ప్రజ్ఞాన్.. ల్యాండర్లోనే ఉన్నట్లు చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని కెమెరాల్లో నిక్షిప్తమైందన్నారు శివన్. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ బలంగా దిగి ఉంటే.. ఏమైనా హాని కలిగి ఉంటుందా? అన్న ప్రశ్నకు మాత్రం.. ఇంకా ఆ వివరాలు తెలియలేదని బదులిచ్చారు.
చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండింగ్‌లో భాగంగా చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది. ల్యాండర్ విక్రమ్ నుంచి ఇస్రో కేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో యావత్ భారతావని నిరాశ చెందిన సమయంలో ల్యాండర్ ఆచూకీ లభించడం ఊరట కలిగించింది.