భారత్-చైనా మధ్య లద్ధాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితిని తగ్గించేందుకు ఎనిమిదో విడత కార్ప్స్ కమాండ్ స్థాయి చర్చలు ప్రారంభమైయ్యాయి. వీటిని చుషూల్-మాల్డో పోస్టులో ఉదయం 9.30 గంటలకు మొదలు పెట్టారు. ఇటీవలే 14వ కోర్ కమాండర్ అధికారిక బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్ భారత్ నుంచి ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించడానికి ముందు జరిగిన రెండు విడతల చర్చల్లో కూడా పాల్గొన్నారు.
ఉద్రిక్తతలు తగ్గించుకొని.. ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణ డిమాండ్‌కు భారత్ కట్టుబడి ఉంది. మే నెల ముందు నాటి పరిస్థితులు నెలకొనాలని భారత్ కోరుతోంది. ఏకపక్షంగా చైనా చేసే డిమాండ్లకు తలొగ్గకూడదని నిర్ణయించుకొంది. ఇది ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా ఉండాలని భారత్ భావిస్తోంది.
ఆరో విడత చర్చల్లో మాత్రం 'అదనపు బలగాల మోహరింపు'ను నిలిపివేయాలని నిర్ణయించాయి ఇరువర్గాలు. ఆ తర్వాత నుంచి ఆ అంశంలో ఎటువంటి పురోగతి లేదు. ఈ సారైనా అవి ఓ కొలిక్కివస్తాయని భారత ఆర్మీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.