తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణనలను తగ్గించేందుకు సోమవారం 7వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు సుదీర్ఘంగా సాగాయి. చర్చల సందర్భంగా.. అన్ని కీలక ఘర్షణ ప్రాంతాల నుంచి చైనా తన సైనిక బలగాలను సత్వరం, పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవటం సహా ఏప్రిల్‌లోని యథాతథ స్థితిని పునరుద్ధరించాలని భారత్ గట్టిగా స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల నుంచి మొదట వైదొలగాల్సింది మీరేనని చైనా వద్ద భారత్ కుండబద్దలు కొట్టిందని పేర్కొన్నాయి.
కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న చుషుల్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా ఈ చర్చలు కొనసాగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ తరఫున కార్ప్స్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్ నేతృత్వం వహించారు.