నిత్యం భక్తజన కోటి పవిత్ర స్నానాలు.. హరహర గంగ నినాదాలు.. శివన్నామస్మరణతో అంతులేని ఆధ్యాత్మికత వెల్లివిరిసిన ప్రయాగ్రాజ్ అర్ధ కుంభమేళా నేటితో ముగియనుంది. కుంభమేళా ముగింపు, మహాశివరాత్రి పర్వదినం ఒకేరోజు రావడం మరో విశేషం.
ప్రయాగ్రాజ్లోని గంగ, యమున, సరస్వతి నదుల సంగమానికి భక్తులు పోటెత్తారు. నేడు ఒక్కరోజే దాదాపు కోటి మంది పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు.
భక్తజన సంద్రమైన ప్రయాగ్రాజ్ 22 కోట్ల మంది
మకర సంక్రాంతి రోజైన జనవరి 15న ప్రయాగ్రాజ్లో అర్ధకుంభమేళా ప్రారంభమైంది. ఇప్పటి దాకా 22 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ ఆధ్యాత్మిక వేడుక నేటితో ముగియనుంది.
మకర సంక్రాంతి, మౌనీ అమావాస్య, వసంత పంచమి, పౌష్ పూర్ణిమ, మాఘీ పూర్ణిమ పర్వదినాల్లో కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. పెద్దలను స్మరిస్తూ తర్పణాలు వదిలారు. కుంభమేళాలో స్నానం సర్వపాప హరణం అనేది భక్తుల విశ్వాసం.
భద్రత నడుమ ప్రశాంతంగా..
పటిష్ఠ భద్రత నడుమ ప్రయాగ్రాజ్లో కుంభమేళా ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 20వేల మంది పోలీసులు, ఆరువేల మంది హోంగార్డులు, 40 పోలీస్స్టేషన్లు, 50 అవుట్పోస్టులు, 40 ఆగ్నిమాపక కేంద్రాలు, 80 కంపెనీల కేంద్ర బలగాలు, 20 కంపెనీల పీఏసీలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
ఉగ్రవాద నిర్మూలన దళం కమాండోలు, బాంబులు నిర్వీర్యం చేసే బృందాలు, ఇంటెలిజెన్స్ యూనిట్లనుభద్రత కోసం ప్రత్యేకంగా నియమించారు.
ఈ కుంభమేళాలో సాంకేతికతను అధికంగా వాడారు. భద్రతతో పాటు భక్తులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు.