కర్ణాటక శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. విశ్వాసపరీక్షను పూర్తి చేయాలని గవర్నర్ వాజూభాయి వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి రెండు ధపాలు ఇచ్చిన ఆదేశాలు ఎక్కువమంది సభ్యులు చర్చలో పాల్గొన్న కారణంగా ఆచరణ సాధ్యం కాలేదు.
అర్ధరాత్రి దాటినా విశ్వాస పరీక్షను శుక్రవారమే నిర్వహించాలని భాజపా సభ్యులు డిమాండ్ చేశారు. విశ్వాస పరీక్షపై చాలామంది సభ్యులు మాట్లాడాల్సి ఉన్న కారణంగా సభను వాయిదా వేయాలని అధికార పక్షనేతలు స్పీకర్ కేఆర్ రమేశ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మంగళవారమూ చర్చకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. సభ్యులు చేసిన అభ్యర్థనపై సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్.
సభ సాగిందిలా...
శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలలోగా విశ్వాస పరీక్ష నిర్వహించాలని గురువారం స్పీకర్‌కు సందేశం పంపిన గవర్నర్... ఈ అంశమై ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేశారు. చర్చ జరుగుతున్న కారణంగా గడువులోగా విశ్వాస పరీక్ష నిర్వహించలేదు. గవర్నర్ విధించిన గడువు పూర్తవుతున్న కారణంగా విశ్వాస పరీక్షకై ప్రతిపక్ష భాజపా సభ్యులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటలలోగా విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్ రెండోసారి సీఎంను ఆదేశించారు. మాట్లాడాల్సిన సభ్యులు ఎక్కువగా ఉన్న కారణంగా గవర్నర్ విధించిన రెండో గడువు లోపలా విశ్వాస పరీక్ష నిర్వహించలేకపోయారు.
- భావోద్వేగంగా కుమారస్వామి
బలపరీక్ష చర్చలో కుమారస్వామి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తనకు అధికారంపై ఆశ లేదని తెలిపారు. 14 నెలల సంకీర్ణ ప్రభుత్వం తుది అంకానికి చేరిందని అభిప్రాయపడ్డారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలు ముంబయికి వెళ్లడానికి పరోక్షంగా సహాయం చేసి ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా చేశారని గవర్నర్‌పై సీఎం ఆరోపణలు చేశారు. గవర్నర్ ఆదేశాల నుంచి రక్షణ కల్పించాలని స్పీకర్‌కు విన్నవించారు. సభా కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
- మౌనంగా విపక్షం
పాలక పక్ష సభ్యులు వివిధ ఆరోపణలు చేసినప్పటికీ ప్రతిపక్ష భాజపా సభ్యులు వ్యూహాత్మక మౌనం పాటించారు. శుక్రవారంతో కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం కుప్ప కూలుతుందని ఆశిస్తున్నానని సభ ప్రారంభానికి ముందు భాజపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. సభలో కుమారస్వామి తన వీడ్కోలు ప్రసంగం చేస్తారు కనుక తాము శాంతంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
- ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అంశంపై చర్చ
రూ. 28 కోట్ల అప్పులు తీర్చే ఒప్పందం పైనే తమ సభ్యుడు శ్రీమంత్ పాటిల్ ముంబయి క్యాంప్‌లో ఉన్నారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించడం సభలో గందరగోళానికి దారి తీసింది. ఈ విషయమై స్పందిచారు పాటిల్. అనారోగ్యం కారణంగా ముంబయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని స్పీకర్‌కు సందేశం పంపారు.