తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కోయంబేడు' మార్కెట్​ వల్లే తమిళులకు కరోనా కీడు!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 6,009 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. పదుల సంఖ్యలో వైరస్​ కారణంగా ప్రాణాలొదిలారు. తమిళనాడులో కేసులు, మరణాల పెరుగుదలలో చెన్నైలోని కోయంబేడు మార్కెట్​దే ప్రధాన పాత్ర. అయినప్పటికీ అధికారులు ఈ మార్కెట్​ను ఎందుకు మూయలేకపోతున్నారు? ఇప్పటివరకు మార్కెట్​తో సంబంధమున్న ఎంతమందికి పరీక్షలు చేశారు? రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో కోయంబేడు మార్కెట్​ ప్రభావమెంత?

Koyambedu market starts an explosion of Covid-19 cases in TN
తమిళులకు ప్రాణాంతకంగా మారిన 'కోయంబేడు' మార్కెట్​!

By

Published : May 9, 2020, 5:07 PM IST

Updated : May 9, 2020, 10:21 PM IST

ఆసియాలోనే అతిపెద్ద పండ్లు, పువ్వులు, కూరగాయల మార్కెట్​గా పేరొందిన చెన్నైలోని కోయంబేడు మార్కెట్​ తమిళనాడులో ప్రస్తుతం కొవిడ్​-19కు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మొత్తం 6,009 కరోనా పాజిటివ్​ కేసులు బయటపడగా.. అందులో ఈ మార్కెట్​కు సంబంధించినవే 1,568. రాష్ట్రంలో చేపల వ్యాపారం నుంచి ఎన్నో సూపర్​ మార్కెట్ల కార్యకలాపాలను నిలువరించగలిగినప్పటికీ.. కోయంబేడును మాత్రం మూసేందుకు సాహసం చేయలేక పోతున్నారు అధికారులు. ఒకవేళ ఈ మార్కెట్​ను మూసివేస్తే.. పండ్లు, కూరగాయలు, పువ్వుల కొరత ఏర్పడే ప్రమాదముందని వెనకడుగేస్తున్నారు.

ఒకేసారి లక్ష మంది

తమిళనాడులో రోజువారీ ఎక్కువ టెస్టులు చేస్తుండటం కూడా కేసుల పెరుగుదలకు ఓ కారణం. ఏప్రిల్​ 28న 41 ల్యాబొరేటరీల ద్వారా మొత్తం 7,093 మందికి పరీక్షలు చేయగా.. ఆ సంఖ్య మే7 నాటికి 14,195కు చేరింది.

ఆంధ్రప్రదేశ్​ సహా ఇతర రాష్ట్రాల నుంచి కోయంబేడు మార్కెట్​కు సరకులు సరఫరా అవుతుంటాయి. వీటికి చెన్నైతో పాటు తమిళనాడు ఉత్తర జిల్లాలైన విల్లుపురం​, కళ్లకురిచి, కాంచీపురం, వెల్లూరు, తిరువల్లూరు, చెంగళ్​పట్టులో మంచి గిరాకీ ఉంది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన అనంతరం.. ఏప్రిల్​ 25న కోయంబేడు మార్కెట్​ దేశం మొత్తాన్ని ఆకర్షించింది. ఒకేసారి లక్ష మందికిపైగా నిత్యావసర సరకులు కొనేందుకు మార్కెట్​కు తరలివచ్చారు. భౌతికదూరం నిబంధనలు పాటించకుండా.. పెద్ద ఎత్తున కూరగాయల కోసం ఎగబడ్డారు.

ఏప్రిల్​ 28న తొలి కేసు

ఆ తర్వాత ఏప్రిల్​ 28న కోయంబేడు మార్కెట్​లో తొలి కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. అక్కడి ఓ వర్తకుడికి కరోనా పాజిటివ్​గా వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. కాంటాక్ట్​ ట్రేసింగ్​ ద్వారా మిగతా వారికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఈ మార్కెట్​తో సంబంధమున్న 6,984 మందికి టెస్టులు నిర్వహించారు. వీరిలో ఆరియలూరు జిల్లా నుంచి అత్యధికంగా 2,615 మంది ఉండగా.. కుడ్డలూరు-1,915, విల్లుపురం-891, పేరంబూర్​-613, చెన్నై-446, కాంచీపురం జిల్లా నుంచి 124 మంది ఉన్నారు.

మార్కెట్​ కారణంగా రెడ్​ జోన్​లోకి జిల్లాలు..

మే 1 నుంచి తమిళనాడులో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందులో కోయంబేడు మార్కెట్​ బాధితులే ఎక్కువమంది ఉన్నారు. ఎన్నో రోజులుగా ఆరెంజ్​ జోన్​లో ఉన్న అరియలూరు.. మార్కెట్​తో సంబంధమున్న 246 మందికి కొవిడ్​-19 పాజిటివ్​గా వచ్చినందున.. ఒక్కసారిగా రెడ్​ జోన్​గా మారింది. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.

భవిష్యత్​లో తగ్గుముఖం

అయితే రానున్న రోజుల్లో కేసుల సంఖ్యను తగ్గించగలమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంటాక్ట్​ ట్రేసింగ్ ద్వారా మార్కెట్​తో సంబంధమున్న వారందరినీ గుర్తించామని.. భవిష్యత్​లో రాష్ట్రంలో కేసులు తగ్గుతాయని చెబుతున్నారు.

ఇదీ చూడండి :రోజూ 'గ్రీన్​ టీ' తాగితే బరువు తగ్గుతారా?

Last Updated : May 9, 2020, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details