అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో నిర్మించిన భారీ క్రికెట్ స్టేడియాన్ని ప్రధానమంత్రి మోదీ, ట్రంప్ కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మోటేరా మైదానం రికార్డుల్లోకెక్కనుంది. ఇప్పటివరకు... ప్రపంచంలోని అతిపెద్దదైన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం రెండో స్థానానికి పడిపోనుంది. మెల్‌బోర్న్ స్టేడియం సామర్థ్యం లక్ష కాగా... లక్షా పది వేల సామర్థ్యంతో మోటేరా స్టేడియాన్ని నిర్మించారు. ఈ స్టేడియాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షించనుంది.
దిగ్గజాల రికార్డులు..
- మోటేరాలో గతంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పేరిట క్రికెట్ స్టేడియం
- 1982లో స్టేడియం నిర్మాణం- 53 వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించే వీలు
- 1983లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌కు వేదిక
- మాజీ క్రికెటర్ సునిల్ గావస్కర్ టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నది ఇక్కడే.
- ఇదే స్టేడియంలో టెస్టుల్లో తొలి ద్విశతకాన్ని నమోదు చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్.
2017లో నూతన మైదానం పనులు..
2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఆ తర్వాత విస్తరణ పనుల్లో భాగంగా 2015లో పాత మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. 2017 జనవరిలో ప్రారంభమైన పనులు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తయ్యాయి. ఎంసీసీని డిజైన్ చేసిన ఎంఎస్ పాపులస్ అనే ఆర్కిటెక్ట్ సంస్థే మోటేరా స్టేడియానికి కూడా రూపకల్పన చేసింది. ఎల్‌అండ్‌టీ సంస్థ మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసింది. 800 కోట్లు ఖర్చుకాగా ప్రపంచంలోనే అత్యధిక ఖర్చుతో నిర్మించిన క్రికెట్ స్టేడియంగా మోటేరా గుర్తింపు సంపాదించింది.
11 పిచ్‌లు..
ఈ మైదానంలో మొత్తం 11 పిచ్‌లను తయారు చేయడం విశేషం. అందులో కొన్ని ఎర్ర మట్టితో, ఇంకొన్ని నల్లమట్టితో మరికొన్ని రెండింటి మిశ్రమంతో తయారు చేశారు. పేసర్లు, స్పిన్నర్లకు సమానంగా సహకరించేలా పిచ్‌లను తీర్చిదిద్దినట్లు స్టేడియం వర్గాలు చెబుతున్నాయి. ఆటగాళ్ల సాధన కోసం ఇండోర్ నెట్స్, 6 పిచ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంత వర్షం పడ్డా 30 నిమిషాల్లో మైదానం నుంచి నీరంతా బయటకు వెళ్లిపోయి మ్యాచ్ మొదలుపెట్టడానికి అనువుగా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
360 డిగ్రీల వ్యూ..