దిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. దేశంలో కరోనా విస్తరిస్తున్న తరుణంలో ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకలు అత్యంత నిరాడంబరంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసిన అనంతరం 90 నిమిషాల పాటు జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆత్మనిర్భర్ భారత్ కేంద్రబిందువుగా సాగిన ప్రసంగంలో అనేక విషయాలను ప్రస్తావించారు. దేశాభివృద్ధికి తన ప్రభుత్వం చేపట్టనున్న చర్యలను వివరించారు. ప్రధాని మోదీ పూర్తి ప్రసంగంలోని హైలైట్స్ ఇవే....
- కరోనా సంక్షోభంలోనూ పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు భారత్‌వైపు చూశాయి.
- ఆత్మనిర్భర్ భారత్ అంటే దిగుమతులను తగ్గించుకోవడమే కాదు.. దేశ శక్తిసామర్థ్యాలు, నైపుణ్యం, సృజనాత్మకతను పెంపొందించుకోవడం కూడా.
- అంతరిక్ష పరిశోధనలను ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
- గతేడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో రికార్డు స్థాయిలో 18 శాతం వృద్ధి నమోదైంది. విధానాలు, ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల ప్రపంచ దేశాలు భారత్‌పై నమ్మకం ప్రదర్శిస్తున్నాయి.
- వ్యవసాయ రంగంలో స్వావలంబన, రైతుల్లో స్వయం సమృద్ధత... ఆత్మనిర్భర్ భారత్‌లో ప్రాధాన్యం. రైతులకు ఆధునిక మౌలికవసతులను అందించడం కోసమే రూ. లక్ష కోట్లతో 'వ్యవసాయ మౌలికవసతుల నిధి'ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- 'మేక్ ఇన్ ఇండియా','మేక్ ఫర్ వరల్డ్' నినాదంతో ముందుకు సాగాలి.
- జాతీయ మౌలికవసతుల ప్రాజెక్ట్(ఎన్ఐపీ) కోసం వివిధ రంగాల్లో 7 వేలకుపైగా ప్రాజెక్టులను ప్రభుత్వం గుర్తించింది. వీటితో మౌలికవసతుల రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి.
- లోపాలను పూడ్చి.. యావత్ దేశమంతా మల్టీ-మోడల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్వైపు అడుగులు వేయాలి.
- దేశంలో మౌలికవసతులు విస్తారంగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి.
- నేషనల్ హెల్త్ మిషన్‌తో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు.
- రానున్న 1000రోజుల్లో 6లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ అనుసంధానం.
- కరోనా వ్యాక్సిన్ వచ్చిన అనంతరం అందరికీ వ్యాక్సిన్ అందే విధంగా ప్రణాళికలు.