తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ గతినే మార్చిన రాజ్యాంగ సవరణలు ఇవి...

1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగం. ఇప్పటివరకు రాజ్యాంగాన్ని 103సార్లు సవరించారు. వీటిల్లో కొన్ని దేశ గతినే మార్చేశాయి.

దేశ గతిని మార్చిన ముఖ్య సవరణలు

By

Published : Nov 26, 2019, 7:21 AM IST

మారుతున్న పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లు, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో.. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా వివిధ లక్ష్యాలతో రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 103 సార్లు సవరించారు. వాటిలో ముఖ్యమైనవి...

తొలి సవరణ (1951)

భూ సంస్కరణలు, ఇతర చట్టాలకు న్యాయ సమీక్ష నుంచి రక్షణ కల్పించారు. మాట్లాడే హక్కుకు 3 పరిమితులను విధించారు.

ఏడో సవరణ (1956)

దేశాన్ని భాషా ప్రాతిపదికన 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్విభజించారు. భాషల పరిరక్షణకు ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషలోనే బోధించేలా 350ఏ ప్రకరణ జోడించారు.

24వ సవరణ (1971)

రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం లోక్‌సభకు కట్టబెట్టారు. ఏదైనా రాజ్యాంగ సవరణను పార్లమెంటు ఉభయసభలు అంగీకరించి, రాష్ట్రపతికి నివేదిస్తే ఆయన తప్పనిసరిగా ఆమోదించాలన్నారు.

42వ సవరణ (1976)

  • సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే మూడు పదాలను ప్రవేశికకు అదనంగా జోడించారు. పౌరులకు ప్రాథమిక విధులను నిర్దేశించారు.
  • న్యాయ సమీక్ష, రిట్‌ పిటిషన్ల విచారణలో సుప్రీం, హైకోర్టుల పరిధి తగ్గించి, రాజ్యాంగ సవరణలను న్యాయసమీక్ష పరిధి నుంచి తొలగించారు.
  • జాతీయ న్యాయ సేవల సంస్థను ఏర్పాటు చేశారు.

44వ సవరణ (1978)

  • అత్యయిక పరిస్థితి ప్రకటించే నిబంధనలో ‘అంతర్గత సమస్యలు’ అనే పదం స్థానంలో ‘సైనిక తిరుగుబాటు’ అనే పదాన్ని చేర్చారు.
  • కేంద్ర మంత్రివర్గం రాతపూర్వక సలహా ఇస్తేనే రాష్ట్రపతి అత్యయిక పరిస్థితిని విధించాలి.
  • ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తిహక్కు తొలగింపు.

73, 74 సవరణలు (1992)

గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు. ‘మున్సిపాలిటీలు’ అనే కొత్త భాగాన్ని చేర్చారు. అన్ని స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలకు ఆదేశం.

86వ సవరణ (2002)

కొత్తగా విద్యాహక్కును చేర్చారు. 6 నుంచి 14 ఏళ్ల వయసులోని బాలబాలికలు అందరికీ ఉచిత, నిర్బంధ విద్య అందించాలని నిర్దేశించారు.

101వ సవరణ (2016)

దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని అమలులోకి తెస్తూ కొత్తగా 269ఏ, 279ఏ ప్రకరణల ఏర్పాటు.

102వ సవరణ (2018)

వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ ఏర్పాటు. బీసీల జాబితాలో మార్పులు, చేర్పులపై అధ్యయనం చేసే బాధ్యత అప్పగింత.

103వ సవరణ (2019)

విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ల కల్పన.

ఓటు హక్కు 18 ఏళ్లకు

రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1988లో రాజ్యాంగానికి 61వ సవరణ చేశారు. అప్పటివరకు 21 ఏళ్లుగా ఉన్న ఓటు హక్కు వయసును ఏకంగా మూడేళ్లు తగ్గిస్తూ 18 ఏళ్లకు కుదించారు. నాటి నుంచే నవ యువత సైతం ఓటేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details