అయ్యప్ప మాలధారణ, మండల దీక్ష అంత సులభం కాదు. 41 రోజుల పాటు కఠోరంగా సాగే అయ్యప్ప దీక్షలో భక్తులు ఎన్నో నియమాలు, ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. ఈ దీక్షలోని చివరి అంకం మత సామరస్యతను కూడా బోధిస్తుంది. అదే అయ్యప్ప యాత్రలో వావర్ స్వామి దర్శనం. శబరిమల దారిలో ఇరుమలై అనే ఒక చిన్న పట్టణం ఉంది. అది అయ్యప్ప ఆలయానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శబరిమలకు వెళ్లే భక్తులు ఇక్కడ ఆగుతారు. అయ్యప్ప దర్శనం ముందు మసీదులో ప్రదక్షిణలు చేస్తారు. అయ్యప్ప భక్తులు.. తమ తమ సంప్రదాయాలను అనుసరించి దర్గాలో పూజలు చేస్తారు. అక్కడే నమాజు కూడా చేస్తారు.
ఇరుముడి తలదాల్చిన భక్తబృందం... ఇరుమలై నుంచి అసలు యాత్రను ప్రారంభిస్తుంది. ఈ దీక్షకు మతంతో సంబంధం లేదన్న వాస్తవాన్నీ, అసలైన లౌకిక భావన భారతీయుల సొంతమనీ వెల్లడి చేసే వేదిక ఈ పట్టణం. హైందవ ధర్మానుసారం దీక్ష చేసిన భక్తులు తొలుత ఇక్కడి వావర్ మసీదును దర్శించుకొని అక్కడి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడి నుంచి శబరిగిరికి చేరుకునేందుకు పెద్దపాదం, చిన్నపాదం అనే రెండు మార్గాలు ఉన్నాయి.
స్థానికంగా వాడుకలో ఉన్న కథ ప్రకారం.. అయ్యప్ప తన తల్లి అనారోగ్యాన్ని తగ్గించేందుకు పులి పాల కోసం బయలుదేరతాడు. అక్కడే వావర్‌ను కలుస్తాడు. మొదట వీరిద్దరికీ యుద్ధం జరిగినప్పటికీ.. తర్వాత మిత్రులుగా మారతారు. అక్కడి నుంచే అయ్యప్ప ప్రయాణంలో వావర్ తోడుగా నిలుస్తాడు. అందుకే తనను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు మొదట వావర్ స్వామిని దర్శించుకోవాలని అయ్యప్ప ఆదేశించాడని స్థానికులు చెబుతారు.